»From 2024 25 Education Year Admissions Will Take Two Times Says University Grants Commission
UGC : ఇకపై యూనిర్సిటీల్లో ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలు : యూజీసీ
ఇప్పటి వరకు యూనివర్సిటీల్లో ప్రవేశించాలంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉండేది. ఇక 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు ఈ ప్రవేశాలకు అనుమతి ఇస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది.
UGC : యూనివర్సిటీల్లోని పలు డిగ్రీలు, కోర్సుల్లో చేరాలంటే ఇప్పటి వరకు ఏడాదికి ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉండేది. విద్యా సంవత్సరం మొదట్లో మాత్రమే వర్సిటీల్లోకి ప్రవేశాలు ఉండేవి. అయితే ఇప్పుడు మాత్రం ఏడాదికి రెండు సార్లు ఈ అవకాశం రానుంది. 2024 -25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త మార్పును తీసుకొస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నిర్ణయం తీసుకుంది.
ఈ విషయమై యూజీసీ(University Grants Commission) ఛైర్మన్ ఆచార్య జగదీష్ కుమార్ మాట్లాడారు. విదేశాల్లో ఉండే యూనివర్సిటీల తరహాలో మన దేశంలోనూ ఇకపై ఇలా ఏడాదికి రెండు సార్లు ప్రవేశాలను(Admissions) అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి సారి ప్రవేశాలు జులై ఆగస్ట్ మధ్య, రెండో విడత ప్రవేశాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ జరుగుతాయని తెలిపారు.
దేశంలో రాష్ట్రాల వారీగా కొన్ని బోర్డులు ఆలస్యంగా ఫలితాలను వెల్లడిస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యల వల్ల కొంత మందికి ఆ ఏడాదిలో జులై ఆగస్టుల మధ్యలో అడ్మిషన్లు తీసుకోవడం కుదరకపోవచ్చు. అలాంటి వారు విద్యా సంవత్సరం అంతా ఆగిపోయి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. మళ్లీ జనవరిలో ప్రవేశం పొందే వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇదేమీ తప్పనిసరి కాదు. ఒక ఆప్షన్‌గా మాత్రమే ఉండనుంది. అలాగే విద్యా సంస్థలు సైతం ల్యాబ్‌లు, ఫ్యాకల్టీలు, తరగతి గదుల్లాంటి వాటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.