»Explosion Occurred While Opening Online Parcel In Sabarkantha Two People Die And One Injured
Gujarat : ఆన్ లైన్లో వచ్చిన పార్శిల్ ఓపెన్ చేయగానే పేలుడు.. ఇద్దరు మృతి
గుజరాత్‌లోని సబర్కాంతలోని వడాలిలో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్శిల్ పేలిన సంఘటన వెలుగులోకి వచ్చింది. డెలివరీ అయ్యాక పార్శిల్ ఓపెన్ చేయగానే పేలిపోయింది.
Gujarat : గుజరాత్‌లోని సబర్కాంతలోని వడాలిలో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్శిల్ పేలిన సంఘటన వెలుగులోకి వచ్చింది. డెలివరీ అయ్యాక పార్శిల్ ఓపెన్ చేయగానే పేలిపోయింది. ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అందజేస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో 11 ఏళ్ల బాలిక, 30 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వడాలిలోని వేద గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు వడాలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర రాబరి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ద్వారా పార్శిల్ డెలివరీ చేయబడింది. పార్శిల్లో ఏదో ఎలక్ట్రానిక్ వస్తువు ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చిన వెంటనే పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. మృతులను జితేంద్ర హీరాభాయ్ వంజారా, ఆయన కుమార్తె భూమిక వంజారాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా భూమిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అతని మరో ఇద్దరు కూతుళ్లు 9 ఏళ్లు, మరొకరు 10 ఏళ్లు తీవ్రంగా కాలిపోయారు. బాలికలిద్దరినీ వెంటనే చికిత్స నిమిత్తం హిమంతనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన బాలికల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచామని అసిస్టెంట్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ విపుల్ జానీ తెలిపారు. వైద్యులు బాలికలను ఎక్స్‌రేలు చేయగా ఒంట్లో ఇనుప ముక్కలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆటో రిక్షాలో పార్శిల్ డెలివరీ చేసినట్లు బాధితుల బంధువు తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ వస్తువును ఆర్డర్ చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.