అధిష్ఠానంతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) రథ సారథి డీకే శివకుమార్ (DK Sivakumar)తాజా ఊహాగానాలపై స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. పీసీసీ పదవికి తాను రాజీనామా చేయడంలేదని డీకే శివకుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి లాంటిదని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో అడుగడుగునా తన పాత్ర ఉందని స్పష్టం చేశారు. కాగా, కర్ణాటక సీఎం ఎంపిక వ్యవహారం నేపథ్యంలో డీకే శివకుమార్ కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)తో భేటీ కానున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఒకెత్తయితే, ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరన్నది తేల్చడం మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
ఈ నెల 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)ఫలితాలు రాగా… నూతన సీఎం ఎవరన్నదానిపై ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం హస్తినకు చేరింది. ‘నేను ఎవరి మధ్యా విభజన తీసుకురాదలుచుకోలేదు. మా బలం 135 మంది సభ్యులు. వారికి నేను నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం బాధ్యతాయుతంగానే ఉంటాను. వెన్నుపోట్లు, బ్లాక్మెయిల్కు దిగను’’ అని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం సీటు కోసం ప్రయత్నిస్తున్న మరో కీలక నేత సిద్ధరామయ్య (Siddaramaiah)సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో, తదుపరి ఏం జరుగనుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, కర్ణాటక సీఎం ఎవరో మంగళవారమే తేలిపోతుందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.