Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కవిత అరెస్ట్‌పై కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్(కంటెంప్ట్ పిటిషన్) దాఖలు చేయనున్నారు. కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కవిత కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. అది కూడా ఢిల్లీ మద్యం కుంభకోణం గురించే. ఈ కేసులో తనను నేరుగా ఈడీ ప్రశ్నించకుండా అడ్డుకోవాలని కవిత గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణలో ఉండగానే కవితను కస్టడీలోకి తీసుకుంది. ఈ విషయమై కవిత భర్త సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. కవిత తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, రోహత్గీ వాదించనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెను వారం పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23 వరకు కవితను విచారించేందుకు ఈడీకి అనుమతిని ఇచ్చింది. ఆదివారం కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆమె భర్త అనిల్, కేటీఆర్, హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ప్రతిరోజు కవితను కుటుంబ సభ్యులు, ఆమె న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కోర్టు కల్పించిన సంగతి తెలిసిందే.