తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకు ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డు వరించనుంది. సినీ నటుడిగా సమాజానికి, రాజకీయ వేత్తగా ప్రజలకు సేవ చేసినందుకు అవార్డు ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందట. ఈ అంశం గురించి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చర్చించారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్టీఆర్కు భారత రత్న అవార్డు ఇవ్వాలని చాలా రోజుల నుంచి టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి వినతిని పరిగణలోకి తీసుకుని, అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
ఎన్టీఆర్ గురించి చర్చ
ఇటీవల బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఎన్టీఆర్ గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. దీంతో ఆయనకు భారత రత్న అవార్డు ఖాయం అనే భావన వ్యక్తమవుతుంది. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలని నేతలకు సూచించారు. ప్రజలతో ఉన్న అనుబంధంతో పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల్లోనే అధికారం చేపట్టారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ పోరాటం బీజేపీకి స్ఫూర్తిగా నిలువాలని కోరారు. ఎన్టీఆర్ గురించి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఏ స్ట్రాటజీ అయి ఉంటుందని చర్చ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పినా.. తమ పార్టీ కూడా అదే స్థాయిలో విస్తరించాలని కోరుకుని ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సంఖ్య పెరిగి, అధికారం చేపట్టే స్థాయికి చేరాలని మోడీ అనుకుంటున్నారు. ఆ మేరకు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
భారత రత్న అవార్డు
ఎన్టీఆర్ శత జయంతి ఈ మే 28వ తేదీన.. ఆ ఉత్సవాల్లో ఎన్టీఆర్కు భారత రత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం భావించి ఉంటుంది. శత జయంతి సందర్భంగా అవార్డు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇదే అంశంపై చర్చించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నిమ్మకూరులో జననం
నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరులో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. విజయవాడ మున్సిపల్ స్కూల్లో ప్రాథమిక విద్య, ఉన్నత విద్య విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగింది. నాటకంలో ఆడ వేషం వేయాలని తెలుగు లెక్చరర్ విశ్వనాథ సత్యనారాయణ కోరగా, మీసంతో వేశారట. దీంతో ‘మీసాల నాగమ్మ’ అనే పేరు వచ్చింది. మేనమామ కూతురు బసవ రామతారకంతో పెళ్లయ్యింది. వీరికి 11 మంది సంతానం. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. నాటకాలు వేస్తూనే.. సినిమాల మీద ఆసక్తితో సినీరంగ ప్రవేశం చేశారు. పల్లెటూరి పిల్లలో అవకాశం వచ్చిన.. నిర్మాణం ప్రారంభం కాలేదు. మనదేశం మూవీ షూటింగ్ స్టార్ట్ అయి రిలీజ్ కావడంతో ఫస్ట్ మూవీ అయ్యింది. 1949లో మనదేశం, 1950లో పల్లెటూరి పిల్ల సినిమాలు విడుదల అయ్యాయి. 1982 మార్చి 29వ తేదీన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.