»Bus Driver The Driver Who Saved 48 Lives By Dying
Bus Driver: చనిపోతూ 48 మంది ప్రాణాలు కాపాడిన డ్రైవర్!
తాను చనిపోతూ 48 మంది ప్రాణాలను ఓ బస్సు డ్రైవర్ కాపాడాడు. గుండెపోటు రావడంతో వేగంగా వెళ్తున్న బస్సును ఆ డ్రైవర్ కట్టడి చేశాడు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
ఓ బస్సు డ్రైవర్ తన ప్రాణాలు పోతున్నా తన బస్సులోని 48 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. వేగంగా వెళ్తున్న బస్సులోని డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో భారీ ప్రమాదం సంభవిస్తుందని గ్రహించిన ఆ డ్రైవర్ వేగంగా ఉన్న బస్సును సురక్షితంగా ఆపాడు. దీంతో ఆ బస్సులోని ప్రయాణికులు ప్రమాదం లేకుండా బయటపడ్డారు. ఈ సంఘటన ఒడిశాలో అర్ధరాత్రి చోటుచేసుకుంది.
మా లక్ష్మీ ట్రావెల్స్‌కు చెందిన ఆ బస్సు ప్రతి రోజూ రాత్రి కంధమాల్ జిల్లాలోని సారన్‌ఘర్ నుంచి ఉదయగిరికి వెళ్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో 48 మంది ప్రయాణికులతో బయల్దేరిన బస్సుకు డ్రైవర్‌గా సనా ప్రధాన్‌కు డ్యూటీ వేశారు. మొదట్లో సాఫీగా ప్రయాణం సాగినా ఆ తర్వాత కంధమాల్ జిల్లాలోని పబురియా గ్రామ సమీపానికి రాగానే బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు బస్సు నడపడం చాలా కష్టం అనిపించింది. తాను చనిపోతానని సనా ప్రధాన్ గ్రహించాడు.
బస్సులోని 48 మంది ప్రయాణికుల ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని సనా ప్రధాన్ భావించాడు. వేగంగా వెళ్తున్న బస్సును ఆపేందుకు ప్రయత్నించాడు. బస్సు వేగాన్ని కంట్రోల్ చేస్తూ రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొన్నాడు. బస్సు స్టీరింగ్‌ను తిప్పుతూ గోడను ఢీకొనడంతో అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులకు అక్కడేం జరుగుతుందో తెలియలేదు. డ్రైవర్ సీటులోనే పడి ఉండటాన్ని గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారు.
ఆ తర్వాత వేరే డ్రైవర్ సాయంతో బస్సు లోని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. డ్రైవర్ సనా ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత కుటుంబీకులకు అందజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం బయటికి రావడంతో డ్రైవర్ పట్ల అందరూ ప్రశంసలు కురిపించారు. 48 మంది ప్రయాణికులను కాపాడిన డ్రైవర్ సనా ప్రధాన్‌కు పలువురు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.