»37 Indian Fishermen Arrested In Sri Lankan Waters
Fishermen arrested: శ్రీలంక జలాల్లో 37 మంది భారత జాలర్లు అరెస్టు
శ్రీలంక సముద్ర జలాల్లో 37 మంది భారతీయ జాలర్లను సముద్ర సరిహద్దు నిబంధనలు పాటించలేదనే కారణంతో లంక అధికారులు అరెస్టు చేశారు. దీంతోపాటు ఐదు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిలో దాదాపు మొత్తం తమిళనాడు వాసులే ఉన్నారని తెలుస్తోంది.
అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL)ను ఉల్లంఘించి, ద్వీప దేశ జలాల్లో చేపలు పట్టినందుకు రామేశ్వరం నుంచి వెెళ్లిన 37 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. దీంతోపాటు వారి నుంచి ఐదు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన మత్స్యకారులందరినీ తదుపరి చర్యల కోసం శ్రీలంకకు తరలించారు. శ్రీలంక జలాల్లో చైనా నేవీ గూఢచారి నౌక లంగరు వేసినట్లు తెలిసిన నేపథ్యంలో నౌకాదళం కూడా పెట్రోలింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఆ క్రమంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా వీరు దొరికిపోయారు.
ఈ ఘటనలో శ్రీలంక నావికాదళానికి చెందిన బహుళ బృందాలు తలైమన్నార్ సమీపంలో చేపలు పట్టే రామేశ్వరం నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులను చుట్టుముట్టాయి. తలైమన్నార్ నేవీ క్యాంపుకు తరలించే ముందు వారిని అరెస్టు చేసి వారి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో నెడుంతీవు సమీపంలో 14 మంది మత్స్యకారులను అరెస్టు చేసి, వారి నుంచి రెండు పడవలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మైలట్టి క్యాంపుకు తరలించారు. అక్టోబర్ 14 నుంచి శ్రీలంక నావికాదళం వేర్వేరు సంఘటనలలో 64 మంది మత్స్యకారులను అరెస్టు చేసింది. 10 పడవలను కూడా స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాస్తూ మాల్దీవుల తీర రక్షక దళం అదుపులోకి తీసుకున్న మత్స్యకారులను, వారి బోట్లను విడుదల చేయాలని అభ్యర్థించారు.