ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 3,595 మంది చిన్నారులు మరణించినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాజా ప్రాంతంలో ఇప్పటి వరకూ 7,703 మంది చనిపోయారని, మరణాల సంఖ్య మరింత పెరగనుందని తెలిపింది.
గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటి వరకూ గాజాలో 7,703 మంది చనిపోయినట్లుగా ఆ ప్రాంత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చనిపోయిన వారిలో 3,595 మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. గాజాపై అటు వైమానికి దాడులు, ఇటు భూతల దాడులు జరుగుతుండటంతో మండుతున్న అగ్నిగోళంగా గాజా కనిపిస్తోంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసినట్లుగా ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. గాజాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఇప్పటి వరకూ గాజా ప్రాంతంలో 19,734 మంది ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అక్కడ సేవలు అందిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఇబ్బందుల నడుమ ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. గాజాలో ప్రస్తుతం ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. మరో వైపు గాజాలో వైమానిక దాడులను పెంచుతున్నట్లుగా ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగరీ వెల్లడించారు.
గాజాలోని ప్రజలు దక్షిణం వైపు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగరీ హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 7వ తేది నుంచి ఆస్పత్రులనే టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ 110 మంది వైద్యులు మరిణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాజా ప్రాంతం మొత్తం ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతోందని, ఆకలితో అలమటిస్తోందని, అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారని పలు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అక్కడి పరిస్థితి మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను నిలిపివేయడం వల్ల స్పష్టమైన సమాచారం ప్రపంచానికి తెలియడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.