»Ernakulam Blast Live Updates Jehovah Witnesses Meeting In Kerala Incendiary Device My Be Used
Kerala Bomb Blast: టిఫిన్ బాక్సుల్లో ఐఈడీ పెట్టి పేల్చేశారు.. అప్రమత్తమైన కేంద్రం
కేరళలోని ఎర్నాకులంలోని కన్వెన్షన్ సెంటర్లో క్రైస్తవుల ప్రార్థనా సమావేశంలో భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు సమాచారం.
Kerala Bomb Blast: కేరళలోని ఎర్నాకులంలోని కన్వెన్షన్ సెంటర్లో క్రైస్తవుల ప్రార్థనా సమావేశంలో భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు సమాచారం. బాంబు పేలుళ్ల సమాచారం అందిన వెంటనే ఎన్ఐఏ, కేరళ పోలీసుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తులో పేలుళ్లకు IED ఉపయోగించినట్లు తేలింది. పేలుడు పదార్థాన్ని టిఫిన్ బాక్సులో దాచిపెట్టడంతో ఎవరూ కనిపెట్టలేకపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా మూడు పేలుళ్లతో కన్వెన్షన్ సెంటర్ మొత్తం దద్దరిల్లింది.
ఎర్నాకులంలోని కలమసేరిలో ఉన్న కన్వెన్షన్ సెంటర్లో యెహోవాసాక్షుల ప్రార్థనలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు వందలాది మంది హాజరయ్యారు. అనంతరం భారీ పేలుడు సంభవించి గందరగోళం నెలకొంది. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులంతా ఎర్నాకులం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. దీనిపై కేరళ పోలీసులు, ఎన్ఐఏ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకోనుంది. కేరళ సీఎం పినరయి విజయన్, హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.