చైనాలో, వివిధ దేశాల్లో కరోనా పెరుగుతుండటంతో రాజస్థాన్ బీజేపీ తన జన్ ఆక్రోశ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే రద్దు నిర్ణయం ప్రకటన తర్వాత కొద్ది గంటల్లోనే తిరిగి కోవిడ్ నిబంధనలతో యాత్రను ప్రారంభిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధనలతో యాత్ర చేపట్టాలని, లేదంటే క్యాన్సిల్ చేసుకోవాలని సూచించింది. బీజేపీ కూడా రాజస్థాన్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తొలుత రద్దు నిర్ణయం తీసుకున్నప్పటికీ, కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకుంది.
బీజేపీ యాత్ర రద్దు ప్రకటన చేయగానే రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ విమర్శలు గుప్పించారు. జన్ ఆక్రోశ్ యాత్రకు జనాధరణ లేదని, మొదటి రోజు నుండి సభలకు ఎవరూ రాలేకపోయారని, కుర్చీలు అన్నీ ఖాళీగా ఉన్నాయని, దీంతో తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు బీజేపీ కోవిడ్ కారణంగా పేరుతో యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని విమర్శించారు. ఆ తర్వాత గంటల్లోనే బీజేపీ యూర్న్ తీసుకొని, కోవిడ్ నిబంధనలతో యాత్రను కొనసాగిస్తామని ప్రకటించింది. రాజస్థాన్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న రాజస్థాన్లో జన్ ఆక్రోష్ యాత్రను ప్రారంభించారు.
ఇప్పటి వరకు 40కి పైగా నియోజకవర్గాల్లో జన్ ఆక్రోశ్ సభలను నిర్వహించారు. రాజస్తాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల లోపు ఈ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్రను నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ, యాత్ర రద్దు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సూచనలు రాలేదని, ఆ సూచనలు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని తెలిపింది.