పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జోరు కనబరుస్తోంది.మొత్తం 63,329 గ్రామ పంచాయతీల్లో టీఎంసీ (TMC) పార్టీ 12,518 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 3,620 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 4,592, కాంగ్రెస్ 1,142, సీపీఐ(ఎం) 1,894 పంచాయతీల్లో గెలుపు లేదా ముందంజలో కొనసాగుతున్నాయి. పంచాయతీ సమితిల విషయానికి వస్తే టీఎంసీ 134, బీజేపీ (BJP) 8, సీపీఎం 6 స్థానాల్లో, జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 22, సీపీఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. 63వేలకు పైగా గ్రామపంచాయతీలకు గాను 28వేల పంచాయతీల సమాచారం మాత్రమే ప్రస్తుతం వెల్లడైంది. మరో 35వేలకు పైగా గ్రామపంచాయతీల ఓట్లు లెక్కించాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లోని 339 కేంద్రాల వద్ద కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు (arrangement) ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు. రాష్ట్ర, కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మరో రెండు రోజులు పట్టే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల అధికారులు (Electoral Officers) వెల్లడించారు. ఆ ఎన్నికల్లో చెలరేగిన హింసతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణల నేపథ్యంలో కొన్ని చోట్ల పోలింగ్‌ను నిలిపివేశారు. అలా 696 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు.వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha elections) జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో జరిగిన బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 34శాతం సీట్లలో టీఎంసీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మిగతా స్థానాల్లో 90శాతం విజయం సాధించింది.