Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికి మూడుసార్లు నోటీసులు ఇచ్చింది. దీనిలో భాగంగా ఈ నెల 3న (ఈరోజు) విచారణను హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ విచారణకు హాజరు కావడం లేదని తాజాగా కేజ్రీవాల్ ఈ సమాచారాన్ని ఈడీ అధికారులకు సమాచారం అందించారు.
ఇప్పటికే రెండుసార్లు విచారణకు గైర్హాజరైన సీఎం మూడోసారి కూడా హాజరు కాలేదు. ఈడీ సమన్లపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఈ నోటీసులు అక్రమమని, కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే వాటిని ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సీఎం కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో ఈ నోటీసులు ఎందుకు పంపారని ప్రశ్నించింది. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నోటీసులు పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ ఇప్పటికే కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను ప్రశ్నించింది. తర్వాత ఈడీ అక్టోబర్‌లో కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. మళ్లీ నవంబర్ 2న సమన్లు జారీ చేసింది. రెండుసార్లు కూడా అరవింద్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా.. ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. దీంతో మూడోసారి నోటీసులు పంపింది.