»Japan Increasing Death Toll Another Danger Lurking
Japan: పెరుగుతున్న మృతుల సంఖ్య.. పొంచి ఉన్న మరో ప్రమాదం
జపాన్లో సంభవించిన భూకంపం ప్రజలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా ఎన్నో ఇళ్లు, భవనాలు శిధిలమయ్యాయి. ఈక్రమంలో ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
Japan: కొత్త సంవత్సరం నాడు జపాన్లో సంభవించిన భూకంపం ప్రజలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా ఎన్నో ఇళ్లు, భవనాలు శిధిలమయ్యాయి. గంటల వ్యవధిలోనే 155 భూకంపాలు సంభవించాయి. అయితే ప్రస్తుతం జపాన్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 62 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల నోటో ద్వీపకల్పం తీవ్రంగా ప్రభావితమైంది. భవనాలు కుప్పకూలిపోగా.. చాలా ఇళ్లు మంటల్లో దగ్ధమయ్యాయి.
ఈ ఘటనలో ప్రస్తుతానికి 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. తీర ప్రాంతంలోని ఇళ్లు దాదాపుగా ధ్వంసం అయ్యాయి. సహాయం కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. భూకంపం వల్ల ఇబ్బంది పడ్డ వారందరిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈరోజు జపాన్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏకదాటిగా భారీ వర్షాలు పడటంతోపాటు కొండచరియలు కూడా విరిగిపడే ప్రమాదం ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.