రాజ్యసభలో (Rajya Sabha) కాంగ్రెస్, బీజేపీ నేతల ఆందోళనతో దద్దరిల్లింది. బలహీన వర్గాల మహిళలను బీజేపీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందని ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman) ఘాటుగా స్పందించారు. బీసీ వర్గాల వారికే టికెట్లు ఇస్తున్నారని వారికి ఎక్కువ చదువు ఉండదని గట్టిగా పోరాడే మహిళలకు టిక్కెట్లు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని రాజ్య సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) అన్నారు. ఖర్గే ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాజ్య సభ సాక్షిగా మహిళలను మల్లికార్జున ఖర్గే అవమానించారని మండిపడ్డారు. ఆదివాసీ మహిళను దేశంలో అత్యున్నత పదవైనా రాష్ట్రపతి(President)ని చేసింది బీజేపీనే అని నిర్మలా సీతారామన్ ఖర్గేకు కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్‌ను ప్రధాని మోడీకి ఇవ్వడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని సెటైర్ వేశారు.
మొత్తానికి మహిళలపై మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్ రాజ్య సభలో రగడ రేపాయి. దీంతో రాజ్య సభను చైర్మన్ రేపటికి వాయిదా వేశారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill) తీసుకువస్తుండడం తెలిసిందే. ఇవాళ ఈ బిల్లును లోక్ సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ఈ నెల 21న రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో, రాజ్యసభలో ఖర్గే దీనిపై ప్రసంగించారు. 2010లోనే కాంగ్రెస్ సర్కారు మహిళా బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. వెనుకబడిన వర్గాల మహిళలకు కూడా అవకాశాలు దక్కాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు మహిళలను చిన్నచూపు చూస్తున్నాయని తెలిపారు. ప్రశ్నించలేని మహిళలకు అవకాశమిచ్చారని ఖర్గే విమర్శించారు. దాని వల్ల ఎవరికి ప్రయోజనం? అని ప్రశ్నించారు. ఖర్గే వ్యాఖ్యలతో బీజేపీ (BJP) సభ్యులు నినాదాలు చేశారు. ఆయన ప్రసంగం ఆపాలని పట్టుబట్టారు.