»Military Schools Center Strongly Denies Congress Allegations
Military schools: కాంగ్రెస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేంద్రం
సైనిక స్కూళ్లను ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. అతని ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది.
Military schools: సైనిక స్కూళ్లను ప్రైవేటీకరించే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. ప్రైవేటీకరణ చేయడానికి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని, ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ ద్వారా దేశంలో 33 సైనిక్ స్కూళ్లు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు సైనిక దళాలు, వాటి అనుబంధ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయి. ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై ప్రభావం పడుతుంది. ఈ ఒప్పందం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు.
దేశ సేవకు కావాల్సిన లక్షణాలను, దార్శనికతను ఈ పాఠశాలల్లోని విద్యార్థులు నిలుపుకోవాలంటే ప్రైవేటీకరణ ఒప్పందాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే 62శాతం పాఠశాలల్ని బిజేపీ-ఆరెస్సెస్ నేతలే సొంతం చేసుకుంటారని ఖర్గే లేఖలో తెలిపారు. ఈ ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఏ రాజకీయ, సైద్ధాంతిక సంస్థలు ఈ ఎంపిక ప్రక్రియ ప్రభావితం చేయవు. దీనికి సంబంధించి వచ్చిన ఆరోపణలు అసంబద్ధమైనవి. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఖండించింది. విద్యారంగంలో అనుభవం ఉన్న సంస్థలతో 100 పాఠశాలలను ఏర్పాటు చేసే పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని తెలిపింది. ఈ ప్రక్రియ ద్వారా 500 దరఖాస్తులను స్కాన్ చేయగా.. 45 పాఠశాలలకు మాత్రమే ఆమోదం లభించిందని తెలిపింది.