విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతుంటాయి. వాటి ద్వారా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందుతుంటారు. ఐఐటీ బాంబేలో ఈ మధ్యనే ప్లేస్ మెంట్స్ డ్రైవ్ జరిగింది. ఇందులో విద్యార్థులు రికార్డులు సృష్టించారు. ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థికి అంతర్జాతీయ సంస్థ రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజ్ ఆఫర్ చేసింది. అలాగే దేశీయ సంస్థ రూ.1.7 కోట్ల వేతన ప్యాకేజీని ఇవ్వనున్నట్లు తెలిపింది. గతేడాది అంతర్జాతీయ సంస్థ గరిష్ఠంగా రూ.2.1 కోట్ల వేతన ప్యాకేజీని ఆఫర్ చేయగా, జాతీయ సంస్థ రూ.1.8 కోట్ల ఆఫర్ ను అందించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో మంచి వేతన ప్యాకేజీలను విద్యార్థులకు కార్పొరేట్ సంస్థలు అందిస్తున్నాయి.
2020-21, 2021-22 ఏడాదులతో పోలిస్తే 2022-23 నియామకాల్లో స్వల్పంగా ఎక్కువ వేతన ప్యాకేజీలతో నియామకాలు జరిగినట్లు తెలుస్తోంది. 2020-21లో సగటున రూ.17.9 లక్షలు, 2021-22లో రూ.21.5 లక్షల ప్యాకేజీ ఇచ్చారు. అయితే ఈసారి రూ.21.8 లక్షల వేతన ప్యాకేజీని కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. 97 ఇంజినీరింగ్ కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం 458 మంది ఉద్యోగులను ఈ ఏడాది నియమించుకోవడం విశేషం.
ఈ ఏడాది 16 మంది గ్రాడ్యుయేట్లకు రూ.కోటికి పైగా వేతన ప్యాకేజీ పొంది రికార్డు సృష్టించారు. మొత్తంగా 300 మంది విద్యార్థులకు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లు వచ్చాయి. 65 ఇంటర్నేషనల్ ఆఫర్లతో కలిపి మొత్తం 194 మంది విద్యార్థులు ఆఫర్లను ఆమోదించి కొలువులు పొందారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం జరుగుతున్న తరుణంలో గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా రిక్రూట్మెంట్లు తగ్గాయి. అయితే అమెరికా, జపాన్, బ్రిటన్, నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్ దేశాల్లోని సంస్థలు మాత్రం మన విద్యార్థులకు మంచి ఆఫర్లను అందించాయి.