ఒడిస్సా రైలు ప్రమాద దుర్ఘటనలో 40 మంది విద్యుత్ షాక్ (electrocution) వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 278 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్(Rescue operation)ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. పట్టాలు తప్పిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఇందులో కనీసం 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లు కన్పించలేదని సదరు పోలీసు అధికారి వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) కూడా తమ ఎఫ్ఐఆర్లో తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో కొన్ని పక్కనున్న ట్రాక్‌పై పడ్డాయి.
అదే సమయంలో ఆ మార్గంలో బెంగళూరు-హావ్‌డా (Bengaluru Howrah Express) ఎక్స్‌ప్రెస్ రావడంతో.. ఆ రైలు పట్టాలు తప్పిన కోరమాండల్ బోగీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఓవర్‌హెడ్ లోటెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతం కూడా చోటుచేసుకుంది. బోగీల మధ్య నలిగిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. అయితే, దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు కన్పించలేదు. రక్తస్రావం జరిగిన ఆనవాళ్లూ లేవు. బోగీలపై లోటెన్షన్ వైర్ పడి విద్యుత్ ప్రసరించడంతో వీరు కరెంట్ షాక్‌కు గురై చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నాం’’ అని ఆ పోలీసు అధికారి అన్నారు.ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు (Odisha Police) కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత సైన్యం, ఒడిశా విపత్తు స్పందన దళం (ODRAF), జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) , స్థానికులు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.అయితే ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. నేడు ఘటనాస్థలానికి వెళ్లిన సీబీఐ (CBI) అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించింది.