కోల్కతా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో మేదినీపుర్ జిల్లాకు చెందిన 65 ఏళ్ల అశోక్ గుచైత్ బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు స్కానింగ్ చేశారు. రిపోర్ట్ చూసి షాక్ అయ్యారు. ఆ వృద్ధుడి కడుపులో 1364 రాళ్లు ఉన్నట్లుగా వారు గుర్తించారు.
ఆపరేషన్ చేయకపోతే అశోక్ గుచైత్ ప్రాణాలకే ప్రమాదం అని మెడికల్ కాలేజీ వైద్యులు చెప్పారు. వెంటనే ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయడం మొదలుపెట్టారు. సుమారు 45 గంటల పాటు ఎంతో కష్టపడి ఆ వృద్ధుడి కడుపులో ఉన్న 1364 రాళ్లను తీసివేశారు. పిత్తాశయంలో భారీ స్థాయిలో రాళ్లు ఉండటం చూసి ఆపరేషన్ చేసిన వైద్యులంతా ఆశ్చర్యపోయారు.
రాళ్లను సమయానికి తొలగించకుండా ఉంటే అవి పిత్తాశయ వాహికల్లోకి వెళ్లి ఉండేవని, అప్పుడు చాలా ప్రమాదం జరిగి ఉండేదని వైద్యులు తెలిపారు. 45 గంటల పాటు చేసిన ఆ ఆపరేషన్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది. సాధారణంగా అయితే ఒక మనిషి కడుపులో కణితి లేదా కొద్దిపాటి రాళ్లు ఉండటం సహజం. కానీ ఈ వృద్ధుడి కడుపులో అన్ని రాళ్లు ఉండటం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు బాగానే ఉన్నాడని, కోలుకుని త్వరలోనే ఇంటికి వెళ్తాడని వైద్యులు తెలిపారు.