కెజియఫ్ హీరో యశ్ అందరికీ తెలిసిందే. కెజియఫ్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న యష్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే జనవరి 8న 38వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు యశ్. కానీ ఈసారి బర్త్ డే వేడుక యశ్‌ను భయపట్టేలా చేసింది.
Yash: కెజియఫ్ చాప్టర్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్.. ఇటీవలె ‘టాక్సిక్’ అనే కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వవ వహిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న రిలీజ్ టార్గెట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. కెజియఫ్ లాంటి భారీ హిట్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదే సమయంలో జనవరి 8న యశ్ 38వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని గడగ్ జిల్లాలో కొందరు అభిమానులు యశ్ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు యత్నించారు.
ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో.. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను యశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందారు. ‘అభిమానుల మరణ వార్త నన్ను చాలా బాధించింది. ఇలాంటిది ఏదైనా జరుగుతుందనే.. నా పుట్టినరోజు నాడు బ్యానర్లు, కటౌట్లు పెట్టడం మానేయాలని ఎన్నోసార్లు కోరాను.
ఇకపై ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం వంటి పనులు చేయడం మానేయండి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో.. పుట్టినరోజు వస్తోందంటేనే నాకు భయమేస్తోంది. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాల బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటానని పేర్కొన్నారు.