కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు స్టార్ హీరో విశాల్. అయితే.. రాను రాను విశాల్ మార్కెట్ కాస్త గట్టిగానే తగ్గిపోయింది. లేటెస్ట్గా వచ్చిన రత్నం సినిమా కూడా కాపాడలేకపోయింది.
Vishal: కెరీర్ స్టార్టింగ్‌లో పందెం కోడిలా దూసుకుపోయిన విశాల్.. ఈ మధ్య మాత్రం రేసులో వెనకబడిపోయాడు. విశాల్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు కానీ.. హిట్లు మాత్రం పడడం లేదు. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ మాస్ హీరోగా తెలుగు, తమిళ్లో మెప్పించాడు విశాల్. కానీ గత కొంత కాలంగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. ఈ మధ్య విశాల్ చేసిన సినిమాల్లో ‘మార్క్ ఆంటోనీ’ మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. దీంతో.. లేటెస్ట్గా వచ్చిన రత్నం సినిమా అయిన విశాల్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని అనుకున్నారు.
మాస్ డైరెక్టర్ హరి, విశాల్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రత్నం వచ్చింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన భరణి, పూజ చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో రత్నంతో హ్యాట్రిక్ హిట్ కొడతారని అనుకున్నారు. కానీ రత్నం కూడా విశాల్‌ను కాపాడలేకపోయింది. అవుట్ డేటెడ్ కథతో హరి మెప్పించలేకపోయాడనే టాక్ సొంతం చేసుకుంది. హరి మార్క్ యాక్షన్ సీన్స్ అదిరిపోయినా.. రొటీన్ కథ వల్ల కనెక్ట్ కాలేకపోయారు ఆడియెన్స్. తమిళ్లో మోస్తరు వసూళ్లను రాబట్టినా.. తెలుగులో మాత్రం రత్నం చాలా కష్టమని అంటున్నారు.
తెలుగులో ఈ సినిమా హిట్ అవ్వాలంటే నాలుగున్నర కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది. కానీ రత్నం వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో తెలుగులో విశాల్ మార్కెట్ పూర్తిగా తగ్గిపోయినట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విశాల్ డిటెక్టివ్ 2 సినిమా చేస్తున్నాడు. అప్పట్లో డిటెక్టివ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో.. ఈ సీక్వెల్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు విశాల్. మరి ఈ సినిమాతోనైనా విశాల్ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.