సినిమాలతో పాటు రాజకీయంగా, వ్యక్తిగంతా ఎప్పటికప్పుడు సెన్సేషన్ అవుతునే ఉంటాడు హీరో విశాల్. రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విశాల్ కూడా అదే దారిలో వెళ్తున్నాడనే వార్తలు వచ్చాయి.
Vishal: ఒకప్పుడు మినిమం గ్యారెంటీ మాస్ హీరోగా తెలుగు, తమిళ్లో మెప్పించాడు విశాల్. పందెం కోడితో మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న విశాల్.. ఆ తర్వాత పొగరు, భరణి, భయ్యా లాంటివి కమర్షియల్ సినిమాలతో దూసుకెళ్లాడు. కానీ గత కొంత కాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు. విశాల్ నుంచి వచ్చిన హిట్ సినిమా ఏదైనా ఉంది అంటే.. అది 2018లో వచ్చిన అభిమన్యుడు మాత్రమే అని చెప్పొచ్చు. అప్పటి నుంచి సక్సెస్ అనేది విశాల్‌కు దూరంగా వెళ్లిపోయింది. కానీ మనోడు మాత్రం సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తునే ఉన్నాడు. చివరగా ‘మార్కో ఆంటోని’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విశాల్.. తమిళ్లో హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. మొన్న ఉన్నట్టుండి తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో విశాల్ కూడా పార్టీ పెడుతున్నాడు.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడనే జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో దీనిపై స్పందించాడు విశాల్. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. నాకు చేతనైనంత సాహాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నాను. విద్యార్థులను చదివిస్తున్నా, రైతులకు సాయం చేస్తున్నాను. కానీ ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని అన్నారు. అయితే.. భవిష్యత్తులో కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం తప్పకుండా పోరాడుతా.. అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు విశాల్. అన్నట్టుగా.. గతంలో విశాల్ ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పట్లో విశాల్ పొలిటికల్ ఎంట్రీ లేదని మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు విశాల్.