హ్యాపీడేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలే చేశాడు. రాను రాను అసలు వరుణ్ సినిమాలు చేస్తున్నాడా? అనే పరిస్థితి వచ్చింది. తాజాగా వరుణ్ 'చిత్రం చూడర' అనే సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
Varun Sandesh: హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ.. వరుణ్ సందేశ్ కెరీర్లో చెప్పుకోదగిన సినిమాలు ఇవి మాత్రమే. మధ్యలో ఏదైనా వచ్చి ఉంటే.. చెప్పలేం గానీ.. వరుణ్ మాత్రం ప్రస్తుతం హీరోగా ఫేడవుట్ అయ్యాడు. ఆ మధ్య పెళ్లి చేసుకున్న వరుణ్.. భార్య వితికా షేరుతో కలిసి పలు టీవి షోలతో పాటు తెలుగు బిగ్ బాస్‌లోనూ సందడి చేశాడు. అయితే తిరిగి తెలుగు తెరపై నిలబడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా కూడా వరుణ్ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. సందట్లో సడెమియా అన్నట్టుగా సినిమాలు చేస్తున్నాడు తప్పా.. ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే సంగతి కూడా చాలామందికి తెలియదు.
ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిత్రం చూడర’ అనే సినిమా చేస్తున్నాడు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారం రెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో శీతల్ భట్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ లాంచ్ చేశారు. ఇందులో వరుణ్ సందేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిగా కనిపించాడు. కానీ టీజర్ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. టీజర్ మాత్రం జనాలను థియేటర్లోకి రప్పించేలా లేదు. దీంతో వరుణ్ పరిస్థితేంటి? అనేది టీజర్‌తోనే చెప్పేస్తున్నారు. ఇక ఈ సినిమాకి రధన్ సంగీతం అందిస్తుండగా, జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.