లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్న నాగచైతన్య.. రీసెంట్గా వచ్చిన ‘థాంక్యూ’ సినిమాతో మాత్రం మెప్పించలేకపోయాడు. అలాగే అమీర్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు చైతూ. ప్రస్తుతం చైతన్య కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘దూత’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అఫిషీయల్‌గా ఈ ప్రాజెక్ట్స్ మాత్రమే చైతన్య చేతిలో ఉన్నాయి.
అయితే ఇప్పటికే ‘సర్కారు వారి పాట’తో హిట్ అందుకున్న పరుశురాంతోను ఓ సినిమా కమిట్ అయ్యాడు చైతన్య. ఇంకా ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక చైతూ కోసం చాలా మంది యంగ్ డైరెక్టర్స్ సినిమాలు చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆ లిస్ట్‌లో తాజాగా ఓ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ చేరినట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఫిల్మ్ ‘నీది నాది ఒకే కథ’తో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు వేణు ఊడుగుల. అయితే ఈ ఏడాది రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కించిన ‘విరాటపర్వం’ సినిమాతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయినా.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దాంతో నెక్ట్స్ నాగచైతన్యతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చైతన్యకు కథను కూడా వినిపించినట్టు టాక్. అన్నీ కుదిరితే చైతూ నెక్ట్స్ ప్రాజెక్ట్ వేణు ఊడుగులతో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు.