భాషపై అభిమానం ఉండవచ్చు.. కానీ మరి మూర్ఖంగా ఉండకూడదు. ఈ విషయం కన్నడ ప్రజలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పది రోజుల వ్యవధిలో సినీ పరిశ్రమకు చెందిన వారిపై కన్నడ ప్రజలు దాడులకు పాల్పడ్డారు. ఇటీవల మంగ్లీపై జరిగిన దాడి మరువక ముందే ఇప్పుడు ప్రముఖ గాయకుడు కైలాశ్ ఖేర్ పై దాడికి పాల్పడ్డారు. కొన్ని రోజుల వ్యవధిలో సినీ ప్రముఖులపై దాడులు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఇతర భాషలకు చెందిన వారు కర్ణాటకలో పర్యటించాలంటే జంకే పరిస్థితి ఎదురైంది.
ఈనెల 21వ తేదీన కర్ణాటకలోని బళ్లారిలో బళ్లారి ఉత్సవ్ జరిగింది. ఈ వేడుకకు గాయని మంగ్లీ హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా పలు పాటలు పాడి ఆహుతులను ఉర్రూతలూగించింది. అయితే కన్నడలో పాటలు పాడాలని కొందరు బలవంతం చేశారని వినిపిస్తున్న మాట. ఇక్కడ తెలుగువారు అధికంగా ఉన్నారని.. అందుకే తెలుగులోనే పాడుతానని మంగ్లీ తెలిపిందని తెలుస్తున్నది. కన్నడ పాటలు పాడకపోవడంతోనే తిరుగు ప్రయాణంలో మంగ్లీ కారుపై దాడికి పాల్పడ్డారు.
తాజాగా ఇప్పుడు హంపి ఉత్సవ్ లో పాల్గొనడానికి వచ్చిన కైలాశ్ ఖేర్ పై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. హిందీ పాటలు పాడుతుండడంతో కన్నడ పాటలు పాడాలని కోరుతూ నీటి సీసాలు స్టేజ్ పైకి విసిరారు. ఈ ఘటనతో కైలాశ్ ఖేర్ ఖంగుతిన్నారు. వెంటనే నిర్వాహకులు స్పందించి వారిద్దరినీ పోలీసులకు పట్టించారు. ఈ దాడులపై సినీ పరిశ్రమకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖులు కర్ణాటకలో పర్యటించే పరిస్థితి లేదని చెబుతున్నారు. భాషపై అభిమానం ఉండాలి కానీ మరి వచ్చిన అతిథులను అవమానించేలా ప్రవర్తించడం సరికాదని కర్ణాటకకు చెందిన వారు కూడా హితవు పలుకుతున్నారు. మరి ఇలాంటి దాడులపై కర్ణాటక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.