Mad Square: మ్యాడ్ సీక్వెల్ టైటిల్ ‘మ్యాడ్ స్క్వేర్’
ప్రస్తుతం ఉన్న నిర్మాణ సంస్థల్లో చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది సితార ఎంటర్టైన్మెంట్స్. లేటెస్ట్గా టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ కొట్టగా.. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటూ రెడీ అవుతున్నారు.
Mad Square: సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి 2023 అక్టోబరులో విడుదలైన ‘మ్యాడ్’ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధంచింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్.. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అయింది. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితార బ్యానర్ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు యూత్ ఫిదా అయిపోయింది. దీంతో అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్.
ఇటీవల ఉగాది పండుగ రోజున ఈ సినిమా ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సీక్వెల్ చిత్రానికి ‘మ్యాడ్ స్క్వేర్’ టైటిల్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్. మ్యాడ్ సినిమాతో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్.. ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ‘మ్యాడ్’ సినిమాలో నటించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు.. ఈ సినిమాలోను నటించనున్నారు.
అయితే హీరోయిన్లు మాత్రం మారనున్నారు. త్వరలోనే కొత్త హీరోయిన్ల వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్, సూర్యదేవర నాగవంశీ సమర్పిస్తున్నారు. భీమ్స్ సీసీరోలియో సంగీతం అందిస్తున్నారు. మరి టిల్లు స్క్వేర్ లాగే మ్యాడ్ స్క్వేర్ హిట్ అవుతుందేమో చూడాలి.