రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలతో సరిపెడుతూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. రీసెంట్గా వచ్చిన 'బ్రో' సినిమా కూడా రీమేక్‌గానే తెరకెక్కాయి. దీంతో స్ట్రెయిట్ ఫిల్మ్ హరిహర వీరమల్లుపైనే పవన్ ఫ్యాన్స్ దృష్టి ఉంది. ఈ సినిమాకు క్రిష్ బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Krrish: ఇప్పటి వరకు రీజనల్ లెవల్లో రీమేక్ సినిమాలతో సరిపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ తర్వాత పాన్ ఇండియా లెవల్లో భారీ పీరియాడికల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్‌తో ‘హరిహర వీరమల్లు’ సినిమాను ప్రకటించి.. వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, లీకేజీ పవన్ ఫ్యాన్స్‌ను పాన్ ఇండియా రేంజ్లో రచ్చ చేయడానికి రెడీగా ఉండండని హింట్ ఇచ్చేశాయి. హరిహర వీరమల్లు థియేటర్లోకి రావడమే లేట్.. పవర్ స్టార్ పాన్ ఇండియా ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తామని.. కాచుకొని ఉంది పవర్ స్టార్ ఆర్మీ.
ఏం లాభం.. హరిహర వీరమల్లు తర్వాత మొదలైన సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి, రిలీజ్ కూడా అవుతున్నాయి.. కానీ హరిహర వీరమల్లు అప్టేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే విషయంలో ఎవ్వరు క్లారిటీ ఇవ్వడం లేదు. డైరెక్టర్ క్రిష్ కూడా ఎక్కడా స్పందించడం లేదు. దీంతో ఇప్పట్లో హరిహర షూటింగ్ కష్టమే అంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాల షూటింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి, హరిహర వీరమల్లు గురించి ఎవ్వరు నోరు మెదపడం లేదు.
2024 ఎన్నికల తర్వాతే.. ఈ సినిమాను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్. దీంతో క్రిష్ ఈ సినిమాను పక్కకు పెట్టేసి.. మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఇప్పటికే స్క్రిప్టు కూడా రెడీ చేసుకున్నాడట క్రిష్. వీలైనంత త్వరగా ఈ సినిమా కంప్లీట్ చేసి వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసి.. ఆ తర్వాత హరిహర వీరమల్లు పై ఫోకస్ చేయనున్నాడని ఇండస్ట్రీ టాక్. త్వరలో క్రిష్ కొత్త ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు. ఇలాంటి వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే.. స్వయంగా క్రిష్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.