తమిళ హీరో కార్తీ నటిస్తున్న కొత్త సినిమా జపాన్. ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదల చేయగా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. నిజ జీవితంలో ఓ దొంగ కథనే ఈ సినిమాగా రూపొందిస్తున్నారట.
మామూలుగానే కార్తీ సాధారణ కథలు ఎంచుకోడు. ఆయనవన్నీ డిఫరెంట్ జోనర్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ కథ కూడా డిఫరెంట్ గా ఉండటంతోనే ఆయన ఎంచుకున్నారు. జపాన్ సినిమా ఫస్ట్ లుక్ సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. రాజా మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 దీపావళి సందర్భంగా గ్రాండ్ రిలీజ్ కోసం రేసులో ఉంది. కాగా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ఓ సరి కొత్త వీడియో విడుదల చేసింది. అందులో కార్తి డబ్బింగ్ చెబుతున్నారు. డబ్బింగ్ పనులు మొదలుపెట్టారనే సింబాలిక్ గా ఈ వీడియో విడుదల చేశారు. అయితే వీడియోలో కార్తీ డబ్బింగ్ చెబుతుంటే, డైరెక్టర్‌కి నచ్చక వన్ మోర్ అంటూ చాలా సార్లు చెప్పించడం విశేషం.
ఇక ఈ సినిమాలో సునీల్, నవనీత్, ఆశా సుధీర్, విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో కార్తి సరసన అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. అది కూడా ఓ దొంగ బయోపిక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులోని చెన్నైలోని ప్రముఖ లలితా జ్యువెలరీలో తిరువారూర్ ముర్గన్ 13 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వజ్రాలను దోచుకున్న సంఘటన గుర్తుండే ఉంటుంది.
ఈ దోపిడీ 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడు పోలీసులు దక్షిణాదిన ఇతర రాష్ట్రాల్లో కూడా దోపిడీలకు పాల్పడిన మురుగన్‌ను అరెస్టు చేశారు. అయితే మురుగన్ 2020లో జైలులో ఎయిడ్స్‌తో మరణించాడు. ఆయన కథతోనే ఈ సినిమా తీశారని, అయితే హీరో ఎలివేషన్స్ ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.