Jeevitha and Rajasekhar were sentenced to one year in prison and fined 5 thousand
పరువునష్టం కేసు(defamation case)లో సినీ నటులు జీవిత, రాజశేఖర్(Jeevitha, Rajashekar) దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ACMM) కోర్టు మంగళవారం ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. వీరు 2011లో చిరంజీవి బ్లడ్‌బ్యాంకు(Chiranjeevi Blood Bank)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అభిమానుల నుంచి, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో విరివిగా అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ సినీ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్ దంపతులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పట్లో చిరంజీవిపై వీరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కారులో వెళ్తున్న ఈ దంపతులపై మెగాస్టార్ అభిమానులు దాడి చేశారు. ఆ తరువాత వీరి నడుమ మా అసోసియేషన్ లో కూడా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి మధ్య ఎలాంటి వివాదాలు లేని సమయంలో కోర్టు తీర్పు వెలువవడటం గమనార్హం.