ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తర్వాత, ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సుల కోసం ఆయనింటిక తరలివచ్చారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తర్వాత, ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సుల కోసం ఆయనింటిక తరలివచ్చారు. ఈ సందర్భంగా తిరుగులేని విజేతగా కీర్తికిరీటాలు తలదాల్చిన పవన్ కళ్యాణ్‌ని మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ మనసారా కౌగలించుకుని పూలవర్షం కురిపించి మరీ ఘనస్వాగతం పలికారు. తర్వాత మెగా మాతృమూర్తి అంజనాదేవి పవన్ కళ్యాణ్‌కి విజయహారతులను పట్టగా, శ్రీమతి సురేఖ విజయతిలకం దిద్దిలోనికి ఆహ్వానం పలికారు. మాతృప్రేమను కురిపిస్తూ అంజనాదేవి కొడుకు సాధించిన ఘనవిజయానికి ఉప్పొంగిపోతూ పవన్‌ని ఆలింగనం చేసుకోగా, పవన్ కళ్యాణ్ సోదరిమణులు ఎనలేని ఆనందంతో ఎదురుసన్నాహాలు పలకడం అక్కడి అందరి గుండెలను కరిగించింది. తర్వాత పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్తుండగా, మెగాస్టార్ చిరంజీవి లోపలినుంచి ఎదురొస్తూ కనిపించగానే పవన్ కళ్యాణ్ ఆయన పాదాల మీద మోకరిల్లారు.
పవన్ కళ్యాణ్‌ని సాదరంగా లేవనెత్తి, మెగాస్టార్ చిరంజీవి హత్తుకుని గజమాలతో ఆహ్వానిస్తున్న సమయంలో పక్కనే ఉన్న మెగాబ్రదర్ మాత్రం జై జనసేన అని నినాదాలు చేయడం అందరినీ ఆనందపారవశ్యంలో ముంచెత్తింది. అనంతరం, కళ్యాణ్ బాబు….హేట్సాఫ్ అని రాసిన కేక్‌ను కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్‌కి కేక్ తినిపించగా, తర్వాత కుటుంబసభ్యలందరూ ఆయనకు కేక్‌ను తనిపించారు. పవన్ కళ్యాణ్ కుమారుడు, శ్రీమతిని కూడా అంతే గౌరవంగా, ప్రేమతో ఆహ్వానించారు మెగాస్టార్ చిరంజీవి. ఎల్లప్పుడూ తన విజయానికి, తన జీవితానికి దిక్సూచి తన అన్నయ్యేనని పదేవదే చెప్పే పవన్ కళ్యాణ్ ఈ విధంగా మెగా దీవెనల కోసం ఢిల్లీ నుంచి వస్తూనే మెగాస్టార్ ఇంట్లో ప్రత్యక్షమవడం వపన్ కళ్యాణ్ పటిష్టమైన, పవిత్రమైన వ్యక్తిత్వానికి గీటురాయిగా నిలిచిపోతుంది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్నది పవన్ కళ్యాణ్ ప్రవర్తనాసరళిని చూస్తే అర్ధమవుతుంది.