Harish Shankar: యానిమల్ సినిమాతో నా అనుమానం బద్దలైంది!
యానిమల్ చిత్రం విడుదలైనప్పటి నుంచి చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించాడు. యానిమల్తో తన అపోహ తొలగిపోయిందన్నారు.
Harish Shankar: సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక(Rashmika mandanna) హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం యానిమల్(Animal). సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచే అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే దీనిపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తుంది. పరిశ్రమలోని దిగ్గజ డైరెక్టర్లు, నటులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చాలా మంది డైరెక్టర్స్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ రివ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar)తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
హరీష్ శంకర్(Harish Shankar) స్పందిస్తూ.. ‘‘యానిమల్’ నచ్చిన వాళ్లు బాగుంది అనడం లేదు, బద్దలైపోయిందంటున్నారు. సినిమాకు రూల్స్ ఏం లేవని అందరూ అంటుంటారు. కానీ సందీప్ రెడ్డి వంగా అన్ని రూల్స్‌ను బ్రేక్ చేసి చూపించారు. సెకండాఫ్ గురించి నాకు కొంత ఆందోళన ఉన్నప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. కథ గురించి వాదించొచ్చు, విజయం గురించి వాదించలేం. సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అనడం కంటే, దీని గురించి చెప్పడానికి ఎవరూ లేరు అనడం సబబు. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసిన వాళ్లందరూ రెండుసార్లు యానిమల్ చిత్రాన్ని చూశారు. ఈ చిత్ర దర్శకుడి పేరులోనే ‘వంగా’ అని ఉన్నప్పుడు.. విమర్శకులకు, విశ్లేషణలకు అతడు వంగుతాడనుకోవడం అమాయకత్వం. ఎవరి విషయం ఎలా ఉన్నా.. ఎక్కువ నిడివి ఉంటే ప్రేక్షకులు సినిమాకు రారేమో అనే నా అపోహను సందీప్ ‘యానిమల్’లోని ఇంటర్వెల్లో వాడిన గన్‌తో పేల్చేశారు. ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు’’ అని హరీశ్ శంకర్ వెల్లడించారు. అలాగే రష్మిక గురించి స్పందిస్తూ.. ‘‘రష్మికకు నా అభినందనలు. గీతాంజలిగా అందరి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఆమె మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.