BRO Movie Director Samuthirakani: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న మూవీ బ్రో.. ఈ సినిమాకు పి. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల వేగం పెరిగింది. బ్రో సినిమాకు సంబంధించి దర్శకుడు సముద్రఖని (Samuthirakani) ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆర్టిస్ట్‌గా మొదలై, పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. ఎలా సాధ్యమైంది..?
ఇండస్ట్రీలో ఏదీ ప్లాన్ చేయలేదని డైరెక్టర్ సముద్రఖని అంటున్నారు. దర్శకుడిగా బ్రో మూవీ తనకు 15 వ సినిమా అని.. ఈ 15 సినిమాలకు తాను ఏదీ ప్లాన్ చేయలేదన్నారు. 1994లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రయాణం మొదలైంది. అప్పటినుంచి తన పని నేను చూసుకుంటూ, జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాను. బుల్లితెర మీద తన ప్రతిభ చూసి ఎస్.పి. చరణ్ తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. మన పని మనం సరిగ్గా చేస్తుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. వచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి.
రీమేక్ చేయడానికి కారణం?
బ్రో కథని అన్ని భాషలకు చేరువ చేయాలి. 12 భాషల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అంటున్నారు. వినోదయ సిత్తం చేయకముందు, తర్వాత ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. వినోదయ సిత్తం చేశాక జీవితంలో సగం సాధించామనే భావన కలిగింది. ఇక ఇప్పుడు బ్రో చేశాక ఇంతకంటే సాధించడానికి ఏం లేదు, ఇప్పటినుంచి జీవితంలో వచ్చేదంతా బోనస్ అనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే భయపడ్డారా?
ఏం ఆలోచించలేదు. కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుంది. అప్పటికి వినోదయ సిత్తం విడుదలై పది రోజులే అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి, తన ఫోన్ నెంబర్ తీసుకొని మరీ నాతో మాట్లాడారు. అంతలా మనుషులను ప్రభావితం చేసే చిత్రమిది. త్రివిక్రమ్ సహకారంతో ఇక్కడ ఈ సినిమా చేయగలిగాను. నేను సినిమా కథ చెప్పినప్పుడు క్లైమాక్స్ సంభాషణలు ఆయనకు బాగా నచ్చాయి. తమిళంలో చేసినప్పుడు కోవిడ్ సమయం కావడంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే నటించానని చెప్పారు. ఈ కథని ఎక్కువ మందికి చేరువ చేయాలని, కళ్యాణ్ అయితో బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని చెప్పారు. అలా కళ్యాణ్‌కు కథ నచ్చడంతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కాలమే త్రివిక్రమ్, కళ్యాణ్‌ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది.
మూవీకి స్ఫూర్తి ఏంటి?
గురువు బాలచందర్‌తో కలిసి 2004లో డ్రామా చూశాను. ఎలా ఉందని అడిగితే, బాగుంది కానీ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తే బాగుంటుంది అన్నాను. అప్పటినుంచి ఆ కథ తనతో పయనిస్తూనే ఉంది. దానిని స్ఫూర్తిగా తీసుకొని 17 ఏళ్ళ తర్వాత సినిమాగా తీశాను. అదే వినోదయ సిత్తం. ఆ స్టేజ్ ప్లే రచయిత డబ్బు ఇస్తానన్నా తీసుకోలేదు. సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని ప్లాన్ చేస్తే, సమాజం మనకి మంచి చేస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది.
బ్రో మూవీ తెలుగు ప్రేక్షకులకు అనుభూతిని పంచగలదా?
కచ్చితంగా అందరికి నచ్చుతుంది. మాతృకలోని ఆత్మని తీసుకొని పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌కి తగినట్టు మార్పులు చేశాం. మాతృక కంటే గొప్పగా ఉంటుంది బ్రో.
రచయిత అయ్యి త్రివిక్రమ్ సహకారం తీసుకోవడానికి కారణం?
సమిష్టి కృషిని నమ్ముతాను. ఇక్కడ నేటివిటీ మీద త్రివిక్రమ్‌కి ఉన్న పట్టు తనకు ఉండదు. పైగా తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం ఆశ్చర్యం కలిగించింది. ఆయనతో అల వైకుంఠపురములో నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఆయనకు సునీల్ వల్ల తన గురించి ముందే తెలిసింది. శంభో శివ శంభో సమయంలో తన గురించి సునీల్ చెప్పేవారట. దర్శకుడిగా త్రివిక్రమ్ తనను ముందు నుంచే నమ్మారు.
విజువల్‌గా ఎలా ఉండబోతుంది?
విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. ఇది 53 రోజుల్లో చేశాం. విజువల్స్ చూస్తుంటే చాలా రోజులు చేసినట్లు ఉంటుంది. 53 రోజులు ఒక్క సెకన్ కూడా వృధా చేయకుండా పనిచేశాం. 150 రోజులు షూట్ చేసిన సినిమాలా అవుట్ పుట్ ఉంటుంది. ఇప్పటిదాకా చేసిన 15 సినిమాల్లో ఇదే బెస్ట్ మూవీ అవుతుంది. మూవీ విషయంలో త్రివిక్రమ్ తండ్రిలా అండగా నిలబడ్డారు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది?
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. మనం ప్రత్యేకంగా ఏం చేయనక్కర్లేదు. కెమెరా పెడితే చాలు, వాళ్ళు స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేస్తారు.
పవన్ కళ్యాణ్ గురించి?
పవన్ కళ్యాణ్‌ని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయన షాక్ అయ్యారు. అలా ఆయనను కలిసిన మూడు రోజులకే షూటింగ్ స్టార్ట్ చేశాం. పవన్ సెట్లో అడుగుపెట్టగానే మొదట ఏం జరుగుతుందోనని మొత్తం గమనిస్తారు. దర్శకుడిగా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది. ఆయన ఈ సినిమా కోసం ఎంతో చేశారు. సమయం వృధా చేయకూడదని సెట్లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు. ఎంతో నిష్ఠతో పనిచేశారు.
థమన్ సంగీతం గురించి?
థమన్ గురించి చెప్పాలంటే చెబుతూనే ఉండాలి. తాను తీసిన 15 సినిమాలలో మొదటిసారి థమన్ నేపథ్య సంగీతం విని కంటతడి పెట్టుకున్నాను.
నిర్మాతల గురించి?
ఈ సినిమా విషయంలో నిర్మాతల సహకారం అసలు మర్చిపోలేను. సినిమాకి ఏది కావాలంటే అది సమకూర్చారు. వాళ్ళు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను.