‘ఫిదా’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని.. నాగ చైతన్యతో ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేశారు క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మరోప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు. కానీ అప్పట్లోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే చాలా సమయం తీసుకోవడంతో..
ఈ ఇద్దరి కాంబో లేనట్టేనని అనుకున్నారు. మధ్యలో రానాతో లీడర్ సీక్వెల్ చేయబోతున్నాడని కూడా వినిపించింది. కానీ తాజాగా ధనుష్‌తో సినిమా మొదలు పెట్టాడు శేఖర్ కమ్ముల. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం.. ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ప్రాజెక్ట్‌ను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు.
నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP లపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావులు భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే ఈ సినిమా కోసం కోసం వివిధ భాషలకు చెందిన స్టార్ క్యాస్టింగ్‌ను తీసుకోబోతునట్టు తెలుస్తోంది.
ఇకపోతే.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.