Vijay Devarakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవరకొండ.. ఫుల్ ఖుషి!
ఈ ఖుషి సక్సెస్‌ను మీతో పంచుకోవాలని.. అందుకోసం వంద కుటుంబాలను సెలక్టె చేసి లక్ష చొప్పున తన సంపాదనలో నుంచి ఇస్తానని.. ఖుషి వైజాగ్ సక్సెస్ మీట్లో మాటిచ్చాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నాడు.
కేవలం సినిమాలే కాదు.. అప్పుడప్పుడు సమాజ సేవ కూడా చేస్తుంటాడు హీరో విజయ్ దేవరకొండ. తన అభిమానుల బాగు కోరుతూ ఏదో ఒక సాయం చేస్తుంటాడు. ఆ మధ్య ఫ్యాన్స్‌తో ఇండియా టూర్ కూడా వేయించాడు. ఇదే కాదు ప్రతి పుట్టిన రోజు సందర్భంగా కూడా జనాలకు ఏదో విధంగా హెల్ప్ చేస్తుంటాడు. అలాగే తన సినిమా హిట్ అయితే కూడా ఆ ఖుషిని అభిమానులతో పంచుకుంటానని.. వంద కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చాడు. సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది.
శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లోను 70 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. ఈ ఖుషి మూమెంట్‌ను తన అభిమానులతో పంచుకోవాలని అనుకున్నాడు విజయ్. అందుకే.. వంద కుటుంబాలకు కోటి రూపాయల సాయం అందించాడు. తాజాగా ఆ వంద కుటుంబాలకు లక్ష రూపాయల చెక్‌ను అందజేశాడు. స్ప్రెడ్డింగ్ ఖుషి అంటూ ఆ వంద మందితో కలిసి ఖుషి టీమ్ ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఓ వీడియో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. నేను ఇప్పుడు సంతోషంగా మరియు సంతృప్తిగా భావిస్తున్నాను. నేను ఆరోగ్యంగా మరియు పని చేస్తూ జీవించే వరకు, ప్రతి సంవత్సరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను.. Stay strong, keep moving forward and everything will happen.. అని రాసుకొచ్చాడు. ఏదేమైనా.. విజయ్ దేవరకొండ వంద కుటుంబాలకు లక్ష చోప్పున కోటి రూపాయలు పంచడం నిజంగా అభినందనీయం.