»Chandramukhi 2 Telugu Movie Review Starring Raghavalrance And Kangana Ranaut
Chandramukhi 2 Review: చంద్రముఖి2 తెలుగు మూవీ రివ్యూ
కాంచన సిరీస్‌లతో హర్రర్ కామెడీ జానర్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన మార్క్ చూపించిన డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఈ సారి ఇంట్రెస్టింగ్ సినిమా చంద్రముఖి సిక్వెల్ చంద్రముఖి 2తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Chandramukhi 2 Telugu Movie Review Starring Raghavalrance and Kangana Ranaut
చిత్రం : చంద్రముఖి 2 నటీనటులు : రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్ తదితరులు రచయిత, దర్శకుడు : పి.వాసు నిర్మాత : సుబాస్కరన్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి సినిమాటోగ్రాఫర్ : ఆర్డీ రాజశేఖర్ విడుదల తేదీ: సెప్టెంబర్ 28, 2023
Chandramukhi 2 Review: హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence), డైరెక్టర్ పి.వాసు (P.Vasu) కాంబినేషన్లో తెరకెక్కిన హార్రర్ కామెడీ చిత్రం చంద్రముఖి 2(Chandramukhi 2) ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2004లో విడుదలైన చంద్రముఖి (Chandramukhi) కి ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చింది. హార్రర్ సినిమాల స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్ పార్ట్1 చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) చేసిన పాత్రను సిక్వెల్లో పోషించారు. ఈ మూవీలో చంద్రముఖిగా కంగనా రనౌత్ (Kangana Ranaut) టైటిల్ రోల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రంపై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. మరి చంద్రముఖి ప్రజలను ఏ మేరకు భయపెట్టిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. తాను పిల్లలతో, మనుమలతో సంతోషంగా ఉంటుంది. కానీ ఉన్నట్టుండి కొన్ని సమస్యలు వారి కుటుంబాన్ని చుట్టుముడతాయి. దాంతో కుటుంబం అంతా వారి కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు పోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. ఆ క్రమంలో వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి ఇంట్లోనుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నకూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ ఉంటుంది. అందరూ ఆ ప్యాలెస్ కు వెళ్తారు. ఆ ఇంటి ఓనర్ గా బసవయ్య (వడివేలు) రంగనాయకి కుటుంబాన్ని ఇంట్లో దక్షిణం వైపు వెళ్లవద్దని చెప్తాడు. కానీ కొందరు వినకుండా వెళ్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఈ కథలో వేటయ్య రాజు పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
హార్రర్ చిత్రాల్లో చంద్రముఖి ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పవచ్చు. అలాంటి క్లాసిక్ మూవీకి సిక్వెల్ చాలా జాగ్రత్తగా తీయాలి. ఆ ఫ్లేవర్ పోతుంది అనుకున్నారేమో అందుకే అదే లైన్‌తో చంద్రముఖి 2 ను తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా ఫ్రెష్‌గా అనిపించదు. మాములుగానే లారెన్స్ హర్రర్ కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటిది చంద్రముఖి 2లో లారెన్స్ కనిపిస్తున్నారంటే అందరిలో ఒక అంచనా వచ్చింది. కానీ తన స్టైల్ సినిమాలకు, ఈ చిత్రానికి వ్యత్యాసం ఉంది కాబట్టి మధ్యలో ఈ చిత్రాన్ని తీశారు. అది కొంత వరకు వర్కౌట్ అయింది. ముందే చెప్పుకున్నట్లు సినిమా స్క్రీన్ ప్లేను కూడా ఉన్నది ఉన్నట్లు ఫాలో అయ్యారు. అందకే మొదటి సీన్ చూడగానే ఈసారి చంద్రముఖి ఎవరిని పడుతుందో ఈజీగా గెస్ చేసేయచ్చు. హీరో ఇంట్రడక్షన్ ఫైట్, వెంటనే మహల్‌కు వచ్చేటప్పుడు పాట, ఈ కుటుంబం దగ్గర అవమానాలు ఎదుర్కొవడం, ప్యాలెస్ పక్కన ఉండే పేద వాడి ఇంట్లో ఉండే అమ్మాయిని హీరో ఇష్టపడటం, ఆ అమ్మాయి ప్యాలెస్‌లో తిరుగుతూ దెయ్యం పట్టినట్లు బిల్డప్ ఇవ్వడం ఇవన్నీ సేమ్ టు సేమ్ మొదటి చంద్రముఖి మాదిరిగానే ఉంటాయి.
ప్రథమార్థం చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. వడివేలు కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇంటర్వెల్ వైపు సాగే కొద్ది కథనంలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్ ప్రారంభంలో మళ్లీ గ్రాఫ్ కిందకి వచ్చేస్తుంది. రాఘవ లారెన్స్, మహిమా నంబియార్ల లవ్ ట్రాక్, పాటలు విసిగిస్తాయి. మళ్లీ వేటయ్య రాజు ఫ్లాష్ బ్యాక్ మొదలవడంతో అక్కడ నుంచి మెల్లగా వేగం పుంజుకుంటుంది కథ. క్లైమ్యాక్స్‌ను మళ్లీ మొదటి భాగం తరహాలోనే ముగించారు. అంతేకాదు మళ్లీ పార్ట్ 3 కోసం కూడా హింట్ ఇవ్వడం విశేషం.
ఎవరెలా చేశారు:
హీరో రాఘవ లారెన్స్‌కు ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. ఆయన నటించి డైరెక్ట్ చేసిన ముని చిత్రం దగ్గర నుంచి నేటి చంద్రముఖి2 వరకు లారెన్స్ ఇలాంటి పాత్రలు చేస్తూనే ఉన్నాడు. కానీ పీరియాడిక్ పోర్షన్లో వచ్చిన వేటయ్య రాజు పాత్ర తనకు పూర్తిగా కొత్త. తన నటనతో ఆ పాత్రకు రక్తి కట్టించాడు. ఇక టైటిల్ పాత్రలో కంగనా రనౌత్ తన చంద్రముఖి పాత్రలో ఈజీగా పరకాయ ప్రవేశం చేసింది. అయితే చంద్రముఖి ఆత్మ పట్టిన తరువాత కొంత సమయం అలరించినా తరువాత ఆ పాత్ర అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. మిగితా నటీనటులు అందరూ వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు:
ఇక ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే హర్రర్ చిత్రాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. కానీ ఈ సినిమాలో కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. అలాగే సినిమాలో వచ్చే పాటలు కూడా పెద్దగా వినసొంపుగా లేవు. ఎలివేషన్ సీన్లలో కూడా మ్యూజిక్ ట్రాక్ ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. అర్ డి రాజశేఖర్ తీసిన ప్రతి షాట్ కూడా చాలా అద్బుతంగా ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. ఇక ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి పనితనం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఎడిటర్ అంటోనీ ఇంకా కొంచెం షార్ప్‌గా కట్ చేస్తే బాగుండేదనిపిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం తగ్గలేదు.