Sonakshi Sinha To Get Married : ప్రేమలో ఉన్న నటుడు జహీర్ఇక్బాల్, నటి సోనాక్షీ సిన్హాలు (Sonakshi Sinha)త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. జూన్ 23న వీరిద్దరూ ముంబయిలో పెళ్లి చేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను సైతం ఎంతో క్రేజీగా డిజైన్ చేయించుకున్నారు. మ్యాగజైన్ కవర్ థీమ్‌తో దాన్ని డిజైన్ చేయించారు. దానికి ‘ది రూమర్స్ ఆర్ ట్రూ’ (పుకార్లు నిజమే) అంటూ క్యాప్షన్‌ని సైతం తగిలించారు. దీంతో ప్రస్తుతం ఈ ఇన్విటేషన్ సైతం మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక్బాల్, సోనాక్షీలు(Zaheer Iqbal and Sonakshi Sinha) గత కొంత కాలంలో ప్రేమలో ఉన్నారు. అయితే అందుకు సంబంధించిన విషయాలను మాత్రం ఎక్కడా బయటకు రానీయలేదు. రెండు కుటుంబాలను ఒప్పించి ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. శత్రుఘ్న సిన్హా నట వారసురాలు సోనాక్షీ సిన్హా. సల్మాన్ ఖాన్‌తో దబాంగ్ సినిమాలో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే పెద్ద హిట్‌ని సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్‌లో సోనాక్షి అలరించింది. దీనిలో ఆమెతో పాటుగా మనీషా కోయిరాలా, అదితీ రావు హైదరీ, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్ మెహతా, తాహాషా తదితరులు నటించారు. మే 1న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్‌లో విడుదలై విజయం సాధించింది.