World super rich: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితా విడుదల అయింది. ఈ జాబితాలో మొత్తం 15 మంది చేరడం విశేషం. ఈ ఏడాది సూపర్-రిచ్ క్లబ్లో(Super Rich Club) 15 మంది 100 బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగి ఉన్నారు. ఈ లిస్టులో ఇంతమంది ఉండడం ఇదే మొదటిసారి. వీరిలో ఇండియా నుంచి గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ సైతం ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, లగ్జరీ వస్తువుల గిరాకీ, భౌగోళిక రాజకీయల్లోని మార్పుల ఆధారంగా వీరి సంపద పెరిగినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. సూపర్-రిచ్ లిస్టులోని 15 మంది సంపద13 శాతం పెరిగి 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంది. ప్రపంచంలోని టాప్ 500 మంది ధనవంతుల సంపదలో పావు వంతు ఈ సూపర్ రిచ్ క్లబ్లో ఉన్న 15 మంది దగ్గరే ఉండడం విశేషం.
ఈ జాబితాలోని ఉన్నవారి సంపద గతంలోనే 100 బిలియన్ డాలర్లు దాటిపోయింది. కానీ అందరు ఒకే సారీ ఈ లిస్టులో చేరడం విశేషం. లోరియల్ ఎస్ఏ వారసురాలైన ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్, డెల్ టెక్ వ్యవస్థాపకుడు మైకేల్ డెల్, మెక్సికన్ బిలియనీర్ కార్లోస్ స్లిమ్ వీరు మాత్రం గత ఐదు నెలల్లోనే 100 బి.డాలర్ల మైలురాయిని తాకారు. గౌతమ్ అదానీ ఈ లిస్టులో తిరిగి స్థానం సంపాదించుకున్నారు. ఈ లిస్టులో తొలి మహిళగా ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ నిలిచారు. సౌందర్య ఉత్పత్తుల కంపెనీ లోరియల్ షేర్లు రాణించడంతో 101 బిలియన్ డాలర్లతో ఆమె 14వ స్థానంలో ఉన్నారు. మైకేల్ డెల్ సంపద 113 బి.డాలర్లుతో 11వ స్థానంలో నిలిచారు. కార్లోస్ స్లిమ్ సంపద 2023లో 28 బిలియన్ డాలర్లు పెరిగి 106 బి.డాలర్లతో 13వ స్థానంలో ఉన్నారు. 222 బిలియన్ డాలర్లతో ఎల్వీఎంహెచ్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉన్నారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 208 బి.డాలర్లతో రెండో స్థానం, ఎలాన్ మస్క్ 187 బి.డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నారు.