ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పని గంటలపై చేసిన వ్యాఖ్యలపై అతనికి కొందరు మద్దతుగా సమాధానాలు చెబితే మరికొందరు విమర్శలు చేశారు. ఈ క్రమంలో 'అంతర్జాతీయ కార్మిక సంస్థ'(ILO) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది.
Working Hours: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి పనిగంటలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశంలోని యువత ప్రతి వారం 70 గంటలు పని చేయాలని, అప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. పని గంటలపై నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలకు కొందరు మద్దతు ఇస్తే.. మరికొందరు విమర్శలు చేశారు. ఈ క్రమంలో ‘అంతర్జాతీయ కార్మిక సంస్థ'(ILO) ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత కష్టపడి పనిచేసే వారిలో భారతీయులు ఉన్నట్లు ఐఎల్ఓ డేటా ద్వారా తెలుస్తుంది. 2023 నాటికి భారతీయులు సగటున వారానికి 47.7 గంటలు పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
పని గంటల విధంగా చూస్తే భారత్ ఏడో స్థానంలో ఉందని తెలిపింది. మనకంటే ముందు ఖతార్, కాంగో, లెసోతో, భూటాన్, జాంబియా, యూఏఈ ఉన్నాయి. అయితే పెద్ద ఆర్థిక వ్యవస్థలను పరిగణనలోకి తీసుకుంటే.. భారతీయులే ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్‌లో 30 పని గంటల విధానం అమల్లో ఉంది. 70 గంటలు కాకుండా వారానికి 48 గంటలు పనిచేయాలని సూచిస్తున్నారు. పనితో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు సమయం దొరుకుతుందని ఐఎల్ఓ డేటా సర్వే తెలిపింది.
నారాయణ మూర్తి ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్‌లో ఉత్పాదకత ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో చాలా తక్కువ ఉంది. యువత వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ వంటి దేశాలు ఇదే సూత్రాన్ని పాటించాయని తెలిపారు. పనిగంటలపై చర్చలు జరగడం ఇదేం తొలిసారి కాదు. చాలామంది ప్రముఖులు పని గంటలపై రకరకాల సూచనలు చేశారని తెలిపారు.