Yeluri Sambasiva Rao: జగన్ 40 లక్షల పేదల్ని ఆస్పత్రి పాలు చేశారు!
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు కల్తీ మద్యం విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో వేలమంది వాళ్ల ఆసుపత్రి పాలై వాళ్ల ప్రాణాలను పొగొట్టుకున్నారని ఆరోపించారు.
Yeluri Sambasiva Rao: ఏపీ టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై ఆరోపణలు చేశారు. కల్తీ మద్యంతో రాష్ట్రంలో 40 లక్షల మంది పేదల్ని ఆసుపత్రి పాలు చేశారని, ఇందులో 30 వేల మంది వారి ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇలా జగన్ ఎన్నో తప్పులు చేసి మద్యం టెండర్లలో చంద్రబాబు తప్పు చేశారని అనడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. నాలుగేళ్లలో మద్యం అమ్మకాలతో జగన్ రూ.24 వేల కోట్లు ప్రజల నుంచి లాక్కోన్నారని దుయ్యబట్టారు. జగన్ చేసిన మద్యం దోపిడీ గురించి ప్రజలకు తెలియకుండా ఉండటానికే చంద్రబాబుపై లేనిపోని నిందలు వేస్తున్నారని సాంబశివరావు అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలు, తయారీ, సరఫరా, డిస్టిలరీస్‌పై సీబీఐ విచారణ కోరే ధైర్యం జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. దాదాపు 100కి పైగా మద్యం బ్రాండ్లకు వైసీపీ ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వస్తుందని జగన్‌కి ముందే తెలుసన్నారు. అందుకే వాసుదేవరెడ్డి ద్వారా జగన్ చంద్రబాబుపై మద్యం కేసు పెట్టించారని మండిపడ్డారు. చంద్రబాబుపై కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే తన కుట్రలతో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని అన్నారు. ఆ కేసు ఆధారాలు నిరూపించలేక జగన్ ప్రజల్లో, న్యాయస్థానాల్లో తీవ్రంగా అవమానపడ్డారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ వస్తుందని జగన్‌కి ముందే తెలిసి..వెంటనే మళ్లీ ఇంకో తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.