»The Wolfs Lone Struggle Like Saving The Dense Forest
Isle Royale: తోడేలు ఒంటరి పోరాటం..దట్టమైన అడవిని కాపాడిందిలా
అంతరించిపోతున్న తమ జాతిని, అడవిని ఓ మగ తోడేలు కాపాడింది. ఆడతోడేళ్లతో జతకట్టి తోడేళ్ల సంఖ్య పెరగడానికి కారణమైంది. అడవిని నాశనం చేసే దుప్పులను వేటాడి దట్టమైన అడవిని కాపాడింది.
ఓ తోడేలు(Wolf) అడవిలోకి ఒంటరిగా వచ్చి అంతరించిపోతున్న జీవజాలాన్ని కాపాడింది. దట్టమైన అడవిని రక్షించింది. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. కెనడా (Canada) దేశం పక్కనే 400 ద్వీపాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఐల్ రాయిలే నేషనల్ పార్క్ (Isle Royale) ఒక పర్యాటక ప్రాంతంగా అందరికీ తెలుసు. ఇది అమెరికాలో ఉన్నా కెనడాను ఒక చిన్న మంచు మార్గం కలుపుతుంది. ఈ ప్రదేశానికి కాస్త దూరంలో మిషిగన్ సరస్సు ఉంటుంది. అక్కడే అనేక జంతువులు జీవిస్తుంటాయి. ఈ ప్రాంతానికి తోడేళ్లు 1940ల ప్రాంతంలో వచ్చాయట. ఆ తోడేళ్లకు ఆహారంగా దుప్పులు ఉండేవి.
ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండే దుప్పులు (Mooses) అక్కడున్న గడ్డి, మొక్కలను తింటూ కడుపునింపుకునేవి. అయితే 1980లో కెనైన్ పార్వోవైరస్ వల్ల చాలా తోడేల్లు మరణించాయి. వాటి సంఖ్య క్రమంగా 12కి చేరింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వైరస్ తగ్గినా ఈ తోడేళ్ల సంఖ్య మాత్రం పెరగలేదు. ఉన్న తోడేళ్లు కూడా నానాటికి కనుమరుగవుతూ వచ్చాయి. దీంతో దుప్పుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
1997లో ఆ ప్రాంతం మొత్తం మొక్కలు లేని ప్రాంతంగా మారిపోయింది. ఆ సమయంలోనే మగ తోడేలు ఒకటి కెనడా నుంచి సన్నని మంచు దారిగుండా నేషనల్ పార్క్ లోకి వచ్చింది. ఆ మగ తోడేలు తన ఆహారం కోసం అక్కడున్న దుప్పులను వేటాడటం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఆడ తోడేళ్లతో జతకట్టి సంతానాన్ని వృద్ధి చేసింది. 34 తోడేళ్లు పుట్టడానికి కారణమైంది. తోడేళ్లు పెరగడంతో దుప్పుల సంఖ్య తగ్గింది. దీంతో అడవి మళ్లీ పచ్చగా వికసించడం ప్రారంభమైంది. అలా నాశనం అయిపోతున్న ఆ అడవిని ఆ మగ తోడేలు కాపాడింది. ఈ తోడేలుకు శాస్త్రవేత్తలు ఓల్డ్ గ్రే గాయ్ అనే ముద్దు పేరు కూడా పెట్టారు.