చైనాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇక్కడ రోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయి. షాంఘైకి సమీపంలోని ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రావిన్స్ జెజియాంగ్ నగరంలోనే ప్రతిరోజు పది లక్షల కేసుల వరకు వెలుగు చూస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయని ఆదివారం నాడు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, చైనాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనాలో మూడేళ్లుగా జీరో కోవిడ్ విధానంలో భాగంగా కఠిన ఆంక్షలు ఉన్నాయి. అయితే ఆంక్షలు సడలించాలనే డిమాండ్లు వచ్చాయి. జీరో కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకోవడంతో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బీజింగ్ సహా వివిధ నగరాల్లో స్మశాన వాటికలు నిండిపోయాయి.
కరోనా కేసులు, మృతులపై చైనా మొదటి నుండి నమ్మదగిన సంఖ్యను చెప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి. చైనా అధికారిక లెక్క ప్రకారం అక్కడ ఐదువేల పైగా మాత్రమే మృత్యువాత పడ్డారు. కానీ ఈ సంఖ్య అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ అని భావిస్తున్నారు. గతంలో బీజింగ్ స్మశాన వాటికకు ఇరవై ముప్పై మృతదేహాలు వస్తే, ఇప్పుడు ఏకంగా 200 దాటుతున్నాయట. హాస్పిటల్స్లో రోగులు కూడా పెరుగుతున్నారు. ప్రస్తుతం చైనా అత్యంత ప్రమాదకర కోవిడ్ వ్యాప్తి వారంలోకి ప్రవేశించిందని క్యాపిటల్ ఎకనమిక్స్ రీసెర్చ్ నోట్ పేర్కొంది. చైనాలో ఈ నెల వరకు 20 కోట్ల మందికి పైగా ఈ వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది. ఇది దేశ జనాభాలో 18 శాతం కంటే ఎక్కువ.
చైనాలో కోవిడ్ కలకలం తిరిగి కనిపించడంతో భారత్ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల నుండి వచ్చే వారికి పరీక్షలు తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. వివిధ దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, కాబట్టి మనం జాగ్రత్తలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడించారు. మాస్కులు ధరించాలని, చేయి చేయి కలపడం మానుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. హెల్త్ మినిస్టర్ మన్సుక్ మాండవీయ ఐఎంఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలో సోమవారం 196 కొత్త కరోనా ఇన్ఫెక్షన్స్ నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు 4.46 కోట్లు దాటాయి. ఇక తెలంగాణలో నిన్నటి వరకు 9 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 8.41 లక్షలకు చేరుకుంది. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా డోసులు అందుబాటులో ఉన్నాయి.