కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వదిలేలా లేదు. ప్రతి సంవత్సరం తగ్గినట్లే తగ్గి.. మళ్లీ విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ కి పుట్టినిల్లు అయిన చైనాలో మరింతగా వ్యాపిస్తోంది. అక్కడ మళ్లీ వేలల్లో కేసులు నమోదౌతున్నాయి. కోవిడ్ లక్షణాలతో హాస్పిటళ్లలో చేరుతున్న వారి సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. కాగా… అక్కడ పలువురు సెలబ్రెటీలు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తాజా సమాచారం. చాలా మంది సెలబ్రెటీలుు ఈ కోవిడ్ కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెబుతున్నారు.
40 ఏళ్ల మేటి ఒపెరా సింగర్ చూ లాన్లన్ మరణించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో చాలా మంది భయాందోళనలకు గురవుతున్నారు. అసలు అధికారికంగా కోవిడ్ మృతుల లెక్క ఎంత ఉంటుందో అని భయపడుతున్నారు. న్యూ ఇయర్ రోజున నటుడు గాంగ్ జిన్టాంగ్ మరణం కూడా ప్రజలను తెగ ఆందోళనకు గురి చేసింది. ఫాదర్ కాంగ్ పాత్రతో గాంగ్ టీవీ ప్రేక్షకుల్ని ఆకర్షించారు. మాజీ జర్నలిస్టు, నాన్జింగ్ వర్సిటీ ప్రొఫెసర్ హూ ఫూమింగ్ జనవరి రెండో తేదీన మరణించారు. డిసెంబర్ 21 నుంచి 26వ తేదీ వరకు దేశంలోని టాప్ సైన్స్, ఇంజనీరింగ్ సైంటిస్టులు 16 మంది చనిపోయినట్లు చైనా మీడియా తెలిపింది.
గత డిసెంబర్లో కోవిడ్ జీరో పాలసీని చైనా ఎత్తివేసింది. దాంతో అక్కడ ఒక్కసారిగా మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగాయి. హాస్పిటళ్లు, శ్మశానవాటికలు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయి. రోజువారీ కేసుల వివరాలను వెల్లడించేందుకు చైనా నిరాకరిస్తోంది.