»Several Indians Duped Into Working In Russian Army
Indians : రష్యా సైన్యంలో చిక్కుకున్న మరికొందరు భారతీయులు.. కాపాడాలంటూ వీడియో
రష్యన్ ఆర్మీ నుంచి భారతీయులకు వరుసగా విముక్తి లభిస్తూ ఉన్నా... ఇంకా వీడియోల ద్వారా అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తమని రష్యా నుంచి కాపాడాలంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
Russian army : రష్యాలో పర్యటించడానికని వెళ్లి అనూహ్యంగా ఆర్మీలోకి వెళ్లిన పలువురు భారతీయులు తమని రక్షించాలంటూ భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో మరొకటి వెలుగులోకి వచ్చింది. రష్యా సైనిక వస్త్రాల్లో ఉన్న ఆరుగురు భారతీయులు(Indians) ఉక్రెయిన్లోని(ukraine) జపొరిజియా ఓబ్లాస్ట్ ప్రాంతం నుంచి ఈ వీడియోని చిత్రీకరించి పంపించారు.
ఈ వీడియోలోని వారంతా పంజాబ్, హర్యానాలకు చెందిన వారు. ఈ వీడియోలో వారు మాట్లాడుతూ ‘మోదీజీ మేం రష్యా సైన్యంలో చిక్కుకుపోయాం. మన రెండు దేశాల మధ్యా మంచి సంబంధాలు ఉన్నాయి. మస్కోలోని భారత ఎంబసీకి కబురు చేసి వీలైనంత త్వరగా మమ్మల్ని విడిపించండి ప్లీజ్’ అంటూ వీడియోని వారు పంపించారు. ఈమేరకు కేంద్రాన్ని వేడుకున్నారు.
మార్చి నెల మొదట్లో కూడా వీరు ఒక వీడియోని విడుదల చేశారు. ముందు రష్యా(Russia) సైన్యంలో హెల్పర్లుగా పని చేయాలని వారు తమకు చెప్పారన్నారు. తర్వాత సాయుధ శిక్షణలో పేర్లు నమోదు చేశారు. మమ్మల్ని ఉక్రెయిన్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహారమూ ఇవ్వడం లేదు. ఫోన్లు లాక్కున్నారు. అంటూ ఆవేదనతో వీడియో విడుదల చేశారు. వీరంతా గతేడాది డిసెంబరు 27న నూతన సంవత్సర వేడుకలకు రష్యా వెళ్లారు. 90 రోజుల వీసాపై మాస్కో చేరుకున్నారు. తమను ఏజెంట్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో స్థానిక పోలీసులు పట్టుకుని రష్యా అధికారులకు అప్పగించడంతో వారు వీరిని ఆర్మీలోకి పంపించివేశారు. వారు ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి రెండో వీడియోని పంపించారు. అయితే ఇప్పటికే రష్యా సైన్యం నుంచి వంద మందికి పైగా భారతీయుల్ని రక్షించినట్లు కేంద్రం వెల్లడించింది. ఎంబసీ ద్వారా చర్చలు జరిపి మిగిలిన వారినీ విడిపిస్తామని తెలిపింది.