»Pakistan Spy Pakistani Spy Arrested In India Office In Moscow
Pakistan Spy: మాస్కో భారత్ కార్యాలయంలో పాక్ గూఢచారి అరెస్టు
భారత్, రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్ నిఘా పెట్టింది. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతనిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మేరఠ్‌లో అరెస్టు చేశారు.
Pakistan Spy: భారత్, రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్ నిఘా పెట్టింది. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతనిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మేరఠ్‌లో అరెస్టు చేశారు. నిందితుడు సతేందర్ సివాల్ విదేశాంగ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. భారత విదేశాంగ శాఖలో ఒక ఐఎస్ఐ ఏజెంట్ చేరారని రహస్య సమాచారం రావడంతో ఏటీఎస్ అప్రమత్తమైంది. అతను భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థకు అందజేస్తున్నాడు. దానికి డబ్బు తీసుకుంటున్నట్లు తెలుసుకుంది. అయితే ఈ సమాచారం వల్ల భారత్‌కు భారీ ముప్పు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.
హాపూర్ జిల్లా షమహిద్దుయూన్పుర్కి చెందిన సతేందర్ మాస్కోలోని కార్యాలయంలో 2021 నుంచి ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పాక్ గూఢచర్య నెట్‌వర్క్‌లో అతను కీలక వ్యక్తని అధికారులు చెబుతున్నారు. తన హోదాను అడ్డం పెట్టుకుని ముఖ్య పత్రాలను సంపాదించాడు. వీటిలో రక్షణ, విదేశాంగ శాఖ నిర్ణయాలు, సైన్యం రోజువారీ కదలికలు వంటి వివరాలున్నాయి. వీటి సమాచారాన్ని పాక్‌లోని ఐఎస్ఐ ప్రతినిధులకు చేర్చినట్లు సతేందర్ విచారణలో ఒప్పుకున్నాడు. అతను పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్లు అంగీకరించాడు.