హమాస్ ఉగ్రవాదులు (Hamas terrorists) ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. దాదాపు గాజా నుంచి ఐదు వేల రాకెట్లు ప్రయోగించారు. సుమారు 20 మందికిపైగా మరణించగా 500కుపైగా గాయపడ్డారు. దీంతో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. ఎయిర్ ఢిఫెన్స్ ద్వారా హమాస్ క్షిపణులను ఎదుర్కొన్నది. అలాగే హమాస్‌పై యుద్ధాన్ని ప్రకటించడంతోపాటు ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్తో ఎదురుదాడి ప్రారంభించింది. దీంతో ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.(Israel)లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు సూచించిన భద్రతాపరమైన ప్రోటోకాల్ పాటించాలని హెచ్చరించింది. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది. సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే భారత ఎంబసీలో సంప్రదించాలని సూచించింది. ఆపరేషన్ ‘అల్- అక్సా ఫ్లడ్’లో భాగంగా అనేక మంది ఇజ్రాయిల్ సైనికులను నిర్బంధించినట్లు హమాస్‌కు చెందిన అల్ కాస్సామ్ బ్రిగేడ్స్ ప్రకటించింది. (Israel Hamas War) సజీవంగా పట్టుకున్న వారి ఫొటోలు, గాజాలోకి తరలిస్తున్న వీడియోలను రిలీజ్ చేసింది.
అలాగే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ మహిళ నగ్న మృతదేహాన్ని ఒక వాహనంలో తరలించిన వీడియో క్లిప్(Video clip) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హమాస్ తీవ్రవాద సంస్థకు చెందిన మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ లో చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడుతున్నట్టు వచ్చిన వార్తలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఇజ్రాయెల్ లో ఉగ్రదాడుల వార్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. ఉగ్రదాడుల్లో బలైన అమాయకుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి తెలుపుతున్నాం అని ఓ ప్రకటనలో మోదీ పేర్కొన్నారు.