చాలామందికి విమానంలో ప్రయాణించాలనే కోరిక ఉంటుంది. బస్సు, రైలు, కారు వంటి వాహనాలను ఎక్కిన వారు ఎందరో కూడా విమాన ప్రయాణం చేయని వారు ఉంటారు. పైగా విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తే ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది. ఓ ప్రయాణీకుడు (UK man) కేవలం ఛార్జీతోనే టిక్కెట్ కొనుగోలు చేసి, ఓ విమానంలో అతను ఒక్కడే దర్జాగా ప్రయాణించాడు. మూడు గంటల పాటు జరిగిన ఆ ప్రయాణంలో అతనిని విమాన సిబ్బంది కూడా విఐపీలా చూసుకున్నది (only passenger in the 3-hour flight). ఈ సంఘటన జరిగింది మన దేశంలో కాదు…. యూకేలో. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం… పాల్ విల్కిన్ సన్ (Paul Wilkinson) టిక్కెట్ ను కొనుగోలు చేసి, మొత్తం విమానంలో తానొక్కడే ప్రయాణించి, తన జీవితంలోనే సరికొత్త అనుభూతిని పొందాడు. పాల్ విల్కిన్ సన్ (Paul Wilkinson) తన కుటుంబ సభ్యులను కలవడానికి పోర్చుగల్ నుండి ఐర్లాండ్ లోని బెల్ ఫాస్ట్ కు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. సమయానికి విమానాశ్రయానికి వచ్చాడు. అతను అక్కడకు వచ్చిన సమయంలో ఎవరూ లేకపోవడం అతనికి కాస్త ఆశ్చర్యం కలిగింది. విమానం అప్పటికే వెళ్లిపోవడం లేదా తాను అందరి కంటే ముందు రావడం జరిగి ఉంటుందని భావించాడు. ఇదే విషయాన్ని సిబ్బందిని అడిగాడు. దానికి ఆ విమాన సిబ్బంది.. ఈ రోజు ఈ విమానంలో మీరు ఒక్కరే ప్రయాణిస్తున్నారు అని చెప్పారు. మీరు ఈ రోజు వీఐపీ అని చెప్పారు (VIP guest).
అయితే ఆ రోజు బెల్ ఫాస్ట్ కు ఇతను తప్ప మరెవరు టిక్కెట్ బుక్ చేసుకోలేదు. దీంతో అతను ఒక్కడే విమానంలో వీఐపీలా ప్రయాణించాడు. విమానంలోకి ఎక్కిన తర్వాత సిబ్బందిని అడిగి తనకు నచ్చిన సీట్లో కూర్చున్నాడు. వారితో ఫోటోలు దిగాడు. విమానంలో సరదాగా గడిపాడు. పోర్చుగల్ నుండి బెల్ ఫాస్ట్ కు మూడు గంటల సమయం పడుతుంది. ఒక్కో ప్రయాణీకుడికి విమాన ఛార్జీ 162 డాలర్లు. భారత కరెన్సీలో ఇది రూ.13,000. కానీ విమానం మొత్తాన్ని బుక్ చేసుకుంటే 28,000 డాలర్లు ఖర్చవుతాయి. కానీ అతను కేవలం టిక్కెట్ ధరతో వీఐపీలా ప్రయాణించాడు. ఈ జర్నీ తనకు అద్భుతంగా అనిపించిందని, సొంత విమానం అనుభూతి పొందానని అతను చెప్పాడు. తమ ప్రయాణీకుడు అవార్డు విన్నింగ్ కస్టమర్ సేవల అనుభూతి పొందినందుకు ఆనందంగా ఉందని విమాన సంస్థ పేర్కొన్నది.