»Decreased Population In Russia Putin Advises Women To Have 8 Children
Russia: తగ్గిపోతున్న రష్యా జనాభా..8 మంది పిల్లల్ని కనాలంటూ పుతిన్ సూచన
ప్రపంచంలోనే అతి శక్తివంత దేశమైన రష్యాలో ఇప్పుడు భారీగా జనాభా తగ్గిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మహిళలకు కీలక సూచన చేశారు. ప్రతి మహిళా 8 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సూచించారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ (India), చైనా (China) ముందంజలో ఉన్నాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం జనాభా భారీగా తగ్గిపోతోంది. ఈ తరుణంలో ఆ దేశ ప్రభుత్వాలు ప్రజలకు పలు సూచనలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా రష్యా (Russia)లో కూడా జనాభా తగ్గిపోతుండటం వల్ల ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ (Putin) మహిళలకు పలు సూచనలు చేశాడు. ప్రతి మహిళా 8 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పుతిన్ సూచించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రష్యా (Russia) రాజధాని మాస్కోలో ప్రపంచ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పుతిన్ (Putin) పాల్గొని కీలక సూచనలు చేశారు. రష్యన్ల కుటుంబాల్లో అమ్మమ్మలు, ముత్తాతలకు 8 మంది కంటే ఎక్కువగా సంతానం ఉండేదని గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. పెద్ద కుటుంబం కలిగి ఉండటం అనేది రష్యాలో ప్రజలందరికీ ఒక కట్టుబాటుగా ఉండాలన్నారు. అదొక జీవన విధానంగా మారాలని పుతిన్ పిలుపునిచ్చారు.
కుటుంబ సాంప్రదాయాలను కాపాడుకోవడం అనేది ఒక నైతిక బాధ్యత అని, అందుకే పెద్ద కుటుంబాలను ప్రోత్సహించడంలో రష్యా ముందుంటుందని అన్నారు. రష్యాలో రోజురోజుకూ గణనీయంగా జనాభా అనేది తగ్గిపోతోందని, ఉక్రెయిన్ యుద్ధం (Ukrain War) కారణంగానే సుమారు 3 లక్షల మంది చనిపోయి ఉంటారని పుతిన్ తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా రష్యాలో చాలా మంది పిల్లల్ని కనకుండా ఉంటున్నారని, మరికొందరు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు తెలిపారు. రష్యాలో జనాభా పెరుగుదల కోసం ప్రతి మహిళా 8 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పుతిన్ సూచించారు.