అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. 2016 లో 3.3 లక్షలుగా ఉన్న తెలుగు జనాభా గత ఎనిమిదేళ్లలో ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది. 2024 నాటికి అమెరికాలో తెలుగు మాట్లేడేవారి సంఖ్య 12.3 లక్షలకు చేరుకుంది. అమెరికాకు చెందిన స్టాటస్టికల్ అట్లాస్ అనే సంస్థ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
America: అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భారతీయులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఉన్నత ఉద్యోగం, హోదా, మంచి జీతం లభించే అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగం చేసేందుకు భారతీయులెందరో సిద్ధంగా ఉంటారు. అందులో మన తెలుగు వారు మొదటి వరుసలో ఉంటారు. అమెరికాలో స్థిరపడుతున్న తెలుగువారి సంఖ్య గత ముప్పై, నలభై సంవత్సరాలుగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఏకంగా 12.3 లక్షలకు చేరినట్లు అక్కడి స్టాటస్టికల్ అట్లాస్ వెల్లడించింది. 2016 లో 3.3 లక్షలుగా ఉన్న తెలుగు జనాభా .. 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగింది.
అమెరికాలో తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో కాలిఫోర్నియా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో టెక్సాస్, న్యూ జెర్సీ నిలిచాయి. కాలిఫోర్నియాలో రెండు లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉండగా..టెక్సాస్‌లో లక్షన్నర మంది, న్యూ జెర్సీలో లక్షా పది వేల మంది ఉన్నారు. ఇల్లినాయిస్, వర్జీనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో కూడా తెలుగు జనాభా ఎక్కువుగానే ఉంది. ఇల్లినాయిస్లో 83 వేల మంది తెలుగు మాట్లాడేవారు ఉండగా.. వర్జీనియాలో 78 వేలు.. జార్జియాలో 52 వేల మంది ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మారాయి. అమెరికాలో ఉంటే.. ఓ తెలుగు ప్రాంతంలో ఉన్నట్లుగా ఉండడం.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అమెరికా తరలివెళుతున్నారు.
ప్రతి ఏటా అమెరికా వెళుతున్న వారి సంఖ్య 70 వేల నుంచి 80 వేల వరకు ఉంటుంది. కొత్తగా అమెరికా వస్తున్న వారిలో ఎక్కువ మంది డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా తదితర ప్రాంతాల్లో నిరసించడానికి ఇష్టపడుతున్నట్లు .. నార్త్ అమెరికాలో తెలుగు అసోసియేషన్‌కు గతంలో సెక్రటరీగా ఉన్న అశోక్ కల్లా తెలిపారు. గతంలో అమెరికా వచ్చే వారిలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలు ఉండేవారని.. ప్రస్తుతం అమెరికా వస్తున్న తెలుగు వాళ్లలో ఐటీ నిపుణులు, ఫైనాన్స్ నిపుణులు వస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికాలో అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అమెరికాలో అనేక భాషలు కూడా మనుగడలో ఉన్నాయి. ఆ భాషల్లో తెలుగు భాష 11వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ఏకంగా 350 భాషలు మాట్లాడే జనాభా ఉన్నారు. భారత దేశం నుంచి అమెరికా వెళ్లిన వాళ్లల్లో ఎక్కువుగా హిందీ, గుజరాతీ మాట్లాడేవారు ఉన్నారు. మూడో స్థానంలో తెలుగువారే నిలిచారు.
వినయ్ అనే ఓ తెలుగు వ్యక్తి కొన్ని నెలల క్రితం టెక్సాస్ వెళ్లాడు. డేటా ఎనలిస్ట్ జాబ్ రావడంతో టెక్సాస్ వెళ్లిన వినయ్…ఇటీవలే డల్లాస్ షిఫ్ట్ అయ్యాడు. తాను ఉంటున్న ప్రాంతంతో పాటు.. తాను తిరిగే ప్రతి చోటూ తెలుగు వారు దర్శనమిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. అందరూ తెలుగు వారే ఉండడంతో తనకు హోం సిక్ ఫీలింగ్ అస్సలు కలగలేదని వినయ్ తెలిపాడు. తెలుగు రాష్ట్రాల సంఖ్య రెండు కాదని.. మూడని అమెరికాలో ఉంటున్న ఓ సీనియర్ సిటిజన్ సరదాగా కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు అమెరికాలో కూడా ఓ తెలుగు రాష్ట్రం ఉందని టీ రాఘవేంద్రరావు అనే 63 ఏళ్ల వ్యక్తి చమత్కరించారు. గత ఐదు దశాబ్ధాలుగా ఆయన అమెరికాలోనే ఉంటున్నారు. అమెరికాలో చదువుకుంటున్న మొత్తం విద్యార్ధుల్లో తెలుగు వారే 12.5 శాతం ఉన్నట్లు ఇండియన్ మొబిలిటీ రిపోర్ట్ 2024 తెలిపింది. అమెరికాలో కొన్ని యూనివర్సిటీలు.. విద్యార్ధులకు స్వాగతం అనే బోర్డులను కూడా తమ క్యాంపస్‌లో ఏర్పాటు చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాలకు మన తెలుగు వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉంటున్నప్పటికీ .. తమ సొంత ప్రాంతంలోనే ఉన్నట్లు ఫీలింగ్ కలుగుతోందని వారు చెబుతున్నారు.