»A Fire Broke Out In The University 14 People Died
Fire Accident: యూనివర్సిటీలో ఘోర అగ్నిప్రమాదం..14 మంది దుర్మరణం
యూనివర్సిటీలో మంటలు చెలరేగడం వల్ల 14 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాద ఘటనలో మరో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఘోర అగ్నిప్రమాదం (Fire accident) సంభవించడంతో యూనివర్సిటీలో 14 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన ఇరాక్ (Iraq)లోని సోరన్ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 14 మంది మరణించగా మరో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
ఇరాక్ లోని ఉత్తర కుర్దిస్థాన్ ప్రాంతంలో సోరన్ యూనివర్సిటీ (Soran University) హాస్టల్ ఉంది. ఈ వసతి గృహంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో అకడమిక్ సిబ్బంది, సోరన్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
#Soran City in Iraqi #Kurdistan Gripped by Tragedy: 14 Lives Lost in Devastating Fire, Investigation Underway
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (Electrical Short Circuit) వల్లే ఈ మంటలు చెలరేగినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. యూనివర్సిటీ భవనంలోని మూడు, నాల్గవ అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. వాటిని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయడం వల్ల మరికొంత మంది ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనపై కుర్దిస్థాన్ ప్రాంత ప్రధాన మంత్రి మస్రోర్ బర్జానీ స్పందించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను తెలుసుకోవాలని, వెంటనే దర్యాప్తును ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు.