100 days cough: కలకలం రేపుతున్న 100 రోజుల దగ్గు వ్యాధి
కోరింత దగ్గు లేదా 100 రోజుల దగ్గు గురించి యూకే ప్రభుత్వం అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, దీంతోపాటు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు.
గత కొన్ని రోజులుగా బ్రిటన్(britain)లోని ఆరోగ్య నిపుణులు అంటు వ్యాధి అయిన కోరింత దగ్గు గురించి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. నిజానికి ఈ వ్యాధిని ‘పెర్టుసిస్ లేదా హూపింగ్ దగ్గు’గా గుర్తించారు. ఈ వ్యాధి సోకిన రోగులు 100 రోజులు ఈ సమస్యను ఎదుర్కొగలరని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అయితే దాదాపు మూడు నెలలకుపైగా ఉండే ఈ వ్యాధి పట్ల అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రారంభంలో ఈ వ్యాధి సోకితే జలుబు లక్షణాలు కనిపిస్తాయని, ఆ తర్వాత దగ్గు సమస్య మూడు నెలలు లేదా దాదాపు 100 రోజులు ఉంటుందని అంటున్నారు.
ఇక జూలై నుంచి నవంబర్ మధ్య 716 పెర్టుసిస్ కేసులు నమోదైనట్లు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. ఇది 2022లో ఇదే కాలం కంటే మూడు రెట్లు ఎక్కువ. అయితే ఈ సంఖ్యలు మహమ్మారి ముందు సంవత్సరాల కంటే తక్కువగానే ఉన్నాయి. ఈ వ్యాధి ఊపిరితిత్తులలో సంక్రమణ ద్వారా వ్యాపిస్తుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ వ్యాధి కేసులు తగ్గాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు సామాజిక దూరాన్ని అనుసరించారు. లాక్డౌన్(lockdown) కూడా ఉంది. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి వ్యాప్తి ముగియడంతో పెర్టుసిస్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు.
పెర్టుసిస్ వ్యాధిలో రోగి ఊపిరితిత్తులు, శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు(doctors) అన్నారు. అంతేకాదు ఈ వ్యాధి కారణంగా 50వ దశకంలో పెద్ద సంఖ్యలో పిల్లలు మరణించారని కూడా హెచ్చరిస్తున్నారు. కానీ 1950 లో దాని టీకా పరిచయంతో దాని కేసులు తగ్గాయి. ఇప్పుడు ఈ వ్యాధి పిల్లలతోపాటు పెద్దవారిలో కనిపిస్తుంది. 100 రోజుల పాటు దగ్గు కారణంగా, రోగులు హెర్నియా, పక్కటెముకల నొప్పి, చెవిలో ఇన్ఫెక్షన్, మూత్రవిసర్జన వంటి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని వైద్యులు అంటున్నారు. అయితే ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. దానిని నివారించడం సాధ్యమేనని మరికొంత మంది నిపుణులు చెప్పడం విశేషం.