News paper packed food: న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహారం ఎందుకు తినకూడదు?
వార్తపత్రికల్లో పార్సెల్ చేసే ఆహారం సాధారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వీకరిస్తుంటారు. అయితే అలా తీసుకునే ఆహారం ద్వారా ఆరోగ్యానికి నష్టం ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పలు రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మనలో చాలా మందికి స్ట్రీట్ ఫుడ్ అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంతో ప్రతిరోజూ రోడ్డు మీద అమ్మే ఫుడ్స్ ని తింటూ ఉంటారు. అయితే మనం తినుబండారాలు అడిగినప్పుడు, వీధి షాపు నుంచి పెద్ద హోటల్ వరకు ప్రతి ఒక్కరూ వార్తాపత్రికలను తీసుకువెళ్లడం సాధారణంగా చూస్తాము. బజ్జీ నుంచి బిర్యానీ వరకు అన్నీ పేపర్లో చుట్టి వడ్డిస్తారు. కొన్నిసార్లు మనం ఇంటికి లేదా ఆఫీసుకు తీసుకొచ్చి తినే వరకు దోసపై పేపర్ అక్షరాలు అలాగే ఉంటాయి. ఫుడ్ రంగు మారుతుంది. అయితే అలా వార్తాపత్రికల్లో కట్టే ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వార్తాపత్రికలకు ఉపయోగించే సిరాలోని రసాయనాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ FSSAI కూడా దీనిపై ఇప్పటికే హెచ్చరించింది. వార్తాపత్రికలలో చుట్టిన ఆహారాన్ని తినడం ప్రమాదకరమైన పద్ధతి అని FSSAI ప్రజలకు తెలిపింది. పేపర్లో చుట్టిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు చుద్దాం.
ఊపిరితిత్తుల క్యాన్సర్కు మార్గం
వార్తాపత్రికలో వేడి ఆహారాన్ని చుట్టినప్పుడు, దాని సిరా వేడి ఆహారానికి అంటుకుంటుంది. ఈ సిరా ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణించి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్లో మొదట ఊపిరితిత్తులలోని బ్రోన్కియోల్స్ లేదా ఆల్వియోలీ కణాలకు వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల పలుచని పొరల్లో క్యాన్సర్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. నెమ్మదిగా మనిషికి శ్వాస సమస్యలు మొదలవుతాయి. వార్తాపత్రికల్లో వేడి ఆహారాన్ని ఎక్కువసేపు తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కంటి చూపు దెబ్బతీనే అవకాశం
కొందరు అనివార్య కారణాల వల్ల ప్రతిరోజూ బయటి ఆహారాన్ని తింటారు. రోజుకు మూడు పూటలా వార్తాపత్రికలో చుట్టి ఆహారం తినే వారు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల అది దృష్టిని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వార్తాపత్రికలపై ఉన్న ఆహారం తీసుకుంటే అందులోని ఇంక్ మీ కంటి చూపును ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఇది దృష్టిని కోల్పోయేలా చేస్తుందన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలేయ క్యాన్సర్కు కారణం
వార్తాపత్రికలో నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుంది. రోజూ రోడ్డుపక్కన భోజనం చేసే వారు ప్లేట్లను వాడటం మంచిది. లేదా అరటి ఆకును ఉపయోగించవచ్చు. వార్తాపత్రికల్లోని ఆహారం తినడం వల్ల కాలేయ క్యాన్సర్తో పాటు మూత్రాశయ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అనేక రకాల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. గ్యాస్, పొట్ట సమస్యలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి. కాబట్టి వార్తాపత్రికలలోని ఆహారాన్ని ఎప్పుడూ తినకండి. సాధ్యమైనంత సురక్షితమైన పద్ధతిని ఉపయోగించండి.